ఉక్రెయిన్‌లో రష్యా సైనికులను బెంబేలెత్తించిన మేక.. గ్రెనేడ్లు పేల్చుతూ చుక్కలు చూపించింది..!

By Mahesh KFirst Published Jun 27, 2022, 5:23 PM IST
Highlights

ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మేక బీభత్సం సృష్టించింది. రష్యా సైనికులను ఆట ఆడుకుంది. గ్రెనేడ్లను భూమిలో పాతి తీగలు కడుతూ రహస్యంగా బాంబులు పెడుతున్న సైనికులను అక్కడే ఉన్న  మేక చెమటలు పట్టించింది. ఆ మేక చేసిన విధ్వంసంలో 40 మందికిపైగా రష్యా సైనికులు గాయపడ్డారు.
 

న్యూఢిల్లీ: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఇంకా జరుగుతూనే ఉన్నది. వ్యూహ ప్రతివ్యూహాలు చేసుకుంటూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ నడిబొడ్డుకు దూసుకెళ్లిన రష్యా సైనికులకు సాధారణంగా సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. అప్పటికే పౌరులకు అవగాహన కల్పించడం, ఆయుధాలపై ప్రాథమిక దశలో ఉక్రెయిన్ శిక్షణ ఇవ్వడం ఆ దేశానికి కలిసి వచ్చింది. ఉక్రెయిన్‌లోకి ఎంటర్ అయిన రష్యా సైన్యాన్ని ఎవరికి తోచిన దారిలో వారు ఒంటరిగానూ ఆపే ప్రయత్నం లేదా ఆటంక పరిచే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు గతంలో చూశాం కూడా. ఒక వ్యక్తి ఒంటరిగా రష్యా మిలిటరీ కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి రోడ్డుపై వాటికి ఎదురుగా వెళ్లి నిలబడ్డాడు. ఇంకొకరు రష్యా యుద్ధ ట్యాంకు ముందు మోకాళ్లపై కూర్చుని ముందుకు వెళ్లేదుంటే.. తన మీది నుంచే వెళ్లాలని రష్యా ఆర్మీకి చెమటలు పట్టించారు. ఇప్పుడు సాధారణ పౌరులు కాదు.. ఘన చరిత్ర గల రష్యా సైనికులను ఒక సాధారణ మేక వణికించింది.

ఉక్రెయిన్‌లో జపోరోజియా పట్టణానికి కొంత దూరంలో కిన్ స్కీ రోజ్డోరీ గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో హాస్పిటల్ సమీపంలో రష్యా సైనికులు మందుపాతరలు అమర్చుతున్నారు. గ్రెనేడ్లను వరుసగా అమర్చి వాటికి తీగలను అనుసంధాన చేసి.. దారికి అడ్డుగా ఏర్పాటు చేస్తున్నారు. అటు వైపు ఎవరు వచ్చినా.. వారి కాళ్లకు కనిపించని ఆ తీగలు తగులుతాయి. తద్వార గ్రెనేడ్‌లు పేలిపోతాయి. ఇదీ ప్లాన్. కానీ, ఈ యుద్ధ ప్రణాళికలను ఒక మేక పారనివ్వలేదు.

రష్యా సేనలు బాంబులు అమర్చుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలో ఓ మేకల ఫామ్ ఉన్నది. అందులో నుంచి ఓ మేక తప్పించుకున్నది. ఆ మేక హాస్పిటల్ వైపే వచ్చింది.  అటు నుంచి ఆ మేక.. గ్రెనేడ్లు అమరుస్తున్న రష్యా సైనికుల వైపు పరుగెత్తింది. అది క్రమంగా రష్యా సైనికులు గ్రెనేడ్లు అమర్చిన ప్రాంతానికి వెళ్లింది. 

ఆ మేక తొలుత గ్రెనేడ్లకు అమర్చిన ఓ తీగను కాలితో తాకింది అనుకోకుండా.. అంతే.. ఆ గ్రెనేడ్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. దీంతో ఆ మేక ఖంగారు పడింది. అనంతరం ఆ మేక వేగం లంకించుకుంది. అది వేగంగా పరుగెత్తుతుండగా అదే స్థాయిలో గ్రెనేడ్లకు అమర్చిన తీగలు ఆ మేక కాలికి తగిలాయి. దీంతో ఒక దాని వెనుక ఒక గ్రెనేడ్ పేలిపోయాయి. వాటిని అమర్చుతున్న రష్యా సైనికులు సైతం భయాందోళనలతో పరుగులు పెట్టారు. కొన్ని క్షణాల్లోనే ఆ మేక అక్కడ భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఇందులో సుమారు 40 మంది రష్యా సైనికులు మరణించినట్టు ఉక్రెయిన్ నిఘా వర్గాలు తెలిపాయి.

అయితే, అంతటి విధ్వంసానికి కారణమైన ఆ మేక మరణించిందా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు. ఎందుకంటే.. ఆ ప్రాంతం రష్యా సైన్యం అధీనంలో ఉన్నదని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.

click me!