
United Nations chief warns: ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతుండటంతో ఈ ప్రభావం అన్ని దేశాలపై పడుతున్నది. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆహార సంక్షోభానికి కారణం కావచ్చుననీ, ఇది సంవత్సరాల పాటు కొనసాగే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి (యూఎన్-UN) హెచ్చరించింది. వివరాల్లోకెళ్తే.. ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచ వాణిజ్య గొలుసు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు, ఆహార ధాన్యాల ఎగుమతుల గొలుసుకు అంతరాయం ఏర్పడింది. అలాగే, ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాలు ఎగుమతులు నిలిచిపోయాయి. పంట సాగుపైనా ప్రభావం పడింది. దీంతో అంతర్జాతీయ ఆహార ధాన్యాల ఎగుమతి పరిస్థితులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. చమురుతో పాటు ఆహార ధాన్యాల ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీని కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే స్పందించిన ఐక్యరాజ్య సమితి (ఐరాస).. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల పేద దేశాల్లో ధరలు పెరిగాయని, దీంతో ఆహార అభద్రత ఏర్పడినట్లు తెలిపింది. రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశముందని హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరల కారణంగా పేద దేశాలలో ఆహార అభద్రతను యుద్ధం మరింత దిగజార్చిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు. యుద్ధం వల్ల పేద దేశాల్లో అన్నింటి ధరలు పెరిగాయని, దీంతో ఆహార అభద్రత ఏర్పడినట్లు ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు ప్రారంభం కాకుంటే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆహార కొరత ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు.
ఉక్రెయిన్ ఎగుమతులు యుద్ధానికి ముందు స్థాయికి పునరుద్ధరించబడకపోతే కొన్ని దేశాలు దీర్ఘకాలిక కరువులను ఎదుర్కొంటాయని ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం.. ఉక్రెయిన్ నౌకాశ్రయాల నుండి సరఫరాలను తగ్గించింది. నౌకాశ్రయాలకు సరఫరా నిలిచిపోయింది.. ఇది ఒకప్పుడు పెద్ద మొత్తంలో వంట నూనెతో పాటు మొక్కజొన్న మరియు గోధుమ వంటి తృణధాన్యాలను ఎగుమతి చేసిందని తెలిపారు. ఇది ప్రపంచ సరఫరాను తగ్గించింది మరియు ప్రత్యామ్నాయాల ధరలు పెరగడానికి కారణమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుతున్న రిపోర్టుల ప్రకారం..గత ఏడాదితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్ధాలు ధరలు దాదాపు 30 శాతం పెరిగినట్లు తెలిపారు. యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయని హెచ్చరించారు.
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ బుధవారం నాడు న్యూయార్క్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘర్షణ - వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి ప్రభావాల కారణంగా ఆహార గోలుసుపై తీవ్రమైన ప్రభావం పడింది. ఇది రానున్న రోజుల్లో అనేక దేశాలను ఆహార సంక్షోభంలోకి నెడుతుంది. ముఖ్యంగా పోషకాహార లోపం, సామూహిక ఆకలి, కరువులు ఏర్పడి.. ఆహార అభద్రతలో పది మిలియన్ల మంది ప్రజలను అంచుకు చేర్చే ప్రమాదం ఉంది అని అన్నారు. "మనం కలిసి పనిచేస్తే ఇప్పుడున్న వనరులను ఉపయోగించుకుని పరిస్థితులు మరింత దిగజారకుండా చర్యలు తీసుకొవచ్చు. కానీ ఈ రోజు మనం ఈ సమస్యను పరిష్కరించకపోతే, రాబోయే నెలల్లో ప్రపంచ ఆహార కొరత భయాందోళనకరంగా ఉంటుంది" అని తెలిపారు. సంక్షోభానికి ఏకైక ప్రభావవంతమైన పరిష్కారం ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తిని, అలాగే రష్యా మరియు బెలారస్ రెండింటి ద్వారా ఉత్పత్తి చేయబడిన ఎరువులను తిరిగి ప్రపంచ మార్కెట్లోకి చేర్చడమేనని గుటెర్రెస్ స్పష్టం చేశారు.