
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) సైనిక చర్య(Military Operation) ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ రష్యా దాడుల్లో ఉక్రెయిన్ పౌరుల్లో పౌరుషం బయటపడింది. దేశం కోసం వారు ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. ఒంటరిగా యుద్ధ ట్యాంకులకు అడ్డంగా వెళ్తున్నారు. ఇటీవలే ఓ ఉక్రెయిన్ పౌరుడు రష్యా మిలిటరీ వాహనాల కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి సాహసోపేతంగా రోడ్డుపై వాటికి అడ్డుగా నిలిచాడు. చేసేదేమీ లేక.. ఆ మిలిటరీ వాహనం కొద్దిసేపు ఆగిపోవాల్సి వచ్చింది. ఆ పౌరుడిని తప్పుకుని ఎలాగోలా బయటపడ్డాయి. ఇప్పుడు మరో పౌరుడు అంతకు మించి అన్నట్టుగా ముందడుగు వేశాడు.
ఉత్తర ఉక్రెయిన్‌లోని బక్మాచ్ నగర వీధుల్లో ఎవరూ ఊహించిన ఘటన జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడో రోజుకు చేరిన శనివారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. చైన్‌ల ఆధారంగా నడిచే యుద్ధ ట్యాంకు మెల్లగా ముందుకు కదులుతుండగా అనూహ్యంగా ఓ ఉక్రెయిన్ పౌరుడు దానికి అడ్డుగా వచ్చాడు. తన రెండు చేతులను యుద్ధ ట్యాంకుకు ఆనించి బలంగా దాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. ముందుకు కదలుతున్న ఆ యుద్ధ ట్యాంకు(War Tank) ఆ పౌరుని చర్య వల్ల నెమ్మదించింది. చివరికి ఆ ట్యాంకు కదలకుండా నిలిచిపోయింది.
ఆ యుద్ధ ట్యాంకు నిలవగానే ఆ పౌరుడు దానికి కొంత దూరంగా వెళ్లి ఎదురుగానే మోకాళ్లపై కూర్చున్నాడు. ఇక్కడి నుంచి ఆ ట్యాంకు కదిలితే.. తన మీది నుంచే వెళ్లాలి అన్నట్టుగా కూర్చున్నాడు. ఇదంతా చూస్తున్న స్థానికులు వెంటనే ఆయన దగ్గర పరుగున ఉరికి వచ్చారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియోతో పాటు ఓ వ్యాఖ్యానాన్నీ జోడించింది. ఉక్రెయిన్ దేశం పౌరులను నిర్బంధంలో ఉంచుతున్నదని రష్యా కొన్నేళ్లుగా అబద్ధాలు చెబుతున్నదని పేర్కొంది. కానీ, వాస్తవం ఏమిటంటే.. ఉక్రెయిన్ పౌరులంతా స్వేచ్ఛగా ఉన్నారని వివరించింది. ఇప్పుడు వారే రష్యా యుద్ధ ట్యాంకులను అవసరమైనప్పుడు ఖాళీ చేతులతో అడ్డుకుంటున్నారని క్యాప్షన్ పోస్టు చేసింది.
రష్యా సేనలు భారీ ఆర్మీ కాన్వాయ్‌లో ఉక్రెయిన్‌లో ప్రవేశిస్తున్నాయి. వీటిని అడ్డుకోవడానికి ఉక్రెయిన్ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఇదిలా ఉండగా ఓ ఉక్రెయిన్ పౌరుడు స్వయంగా ఆర్మీ కాన్వాయ్‌కు అడ్డంగా వెళ్లాడు. రోడ్డుపై వరుసగా వస్తున్న ఆర్మీ వాహనాలను అడ్డుకోవాలని ఆయన ప్రయత్నించాడు. ప్రాణాలు పోతాయన్న భయమే లేకుండా ఆయన నేరుగా ఆర్మీ కాన్వాయ్‌కు అడ్డంగా వెళ్లి వాటిని ఆపే ప్రయత్నం చేశాడు. కాన్వాయ్ నుంచి ఒక వాహనం ఆయన అడ్డురావడంతో పక్కకు వచ్చి ఆగిపోయింది. కానీ, ఆ తర్వాత వెంటనే ఆ వ్యక్తి పక్క నుంచి వెళ్లిపోయింది. కాన్వాయ్‌లోని మిగతా వాహనాలూ ఆ వాహనాన్ని అనుసరించాయి. అయినా.. ఆ వ్యక్తి మళ్లీ ఆ వాహనాలను ఆపే ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాడు. ఈ ఘటన వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియో వైరల్ అయింది.