
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine) సంక్షోభం రోజుకో మలుపు తిరిగేలా కనిపిస్తున్నది. ఇప్పటికే క్షణ క్షణం ఉత్కంఠగా ఉన్నది. ఉక్రెయిన్‌పై తాము దాడి చేయబోమని, అలాంటి ప్లాన్‌లు ఏమీ లేవని రష్యా(Russia) పదే పదే చెబుతున్నది. అలాగే, ఉక్రెయిన్ ఉత్తరం వైపున మోహరించిన బలగాలు(Forces) వెనక్కి వస్తున్నట్టూ చెప్పింది. కానీ, అమెరికా(America) మాత్రం రష్యా మాటలను నమ్మడం లేదు. రష్యా ఇప్పటికీ ఉక్రెయిన్ పై దాడి(Attack) చేసే ప్లాన్‌లను కలిగి ఉన్నదని వాదిస్తున్నది. ఇదిలా ఉండగా, రష్యా కూడా యుద్ధ వ్యూహాన్ని(War Strategy) మొదలు పెట్టిందా? అనే చర్చ జరుగుతున్నది. ఉక్రెయిన్ దేశ బలగాలు తమ బార్డర్ ఫోర్స్ పోస్టుపై దాడి చేశాయని రష్యా చెబుతున్నది. ఇది అబద్ధం అని ఉక్రెయిన్ కొట్టి పారేస్తున్నది.
ఉక్రెయిన్ భూభాగం నుంచి తమ భూభాగంలోని బోర్డర్ గార్డ్ పోస్టుపై షెల్లింగ్ దాడి జరిగిందని, ఈ దాడిలో తమ పోస్టు మొత్తం ధ్వంసం అయిపోయిందని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది. రోస్తోవ్ రీజియన్‌లోని తమ బోర్డర్ గార్డ్ పోస్టు పూర్తిగా ధ్వంసం అయిందని వివరించింది. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదని పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల సరిహద్దుకు 150 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్టు తెలిపింది.
ఇదిలా ఉండగా, తూర్పు ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా అనుకూల వేర్పాటువాదుల దాడులు గురువారం నుంచి తీవ్రంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఉక్రెయిన్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా, రష్యా చెబుతున్నట్టుగా తమ బలగాలు షెల్లింగ్ దాడులకు పాల్పడలేదని ఉక్రెయిన్ తెలిపింది. రష్యా ప్రకటన పూర్తిగా అబద్ధం అని ఉక్రెయిన్ మిలిటరీ కొట్టిపారేసింది. దీంతో యుద్ధ వ్యూహాలను రష్యా అమలు చేస్తున్నదా? అనే అనుమానాలు పశ్చిమ దేశాల్లో మొదలవుతున్నాయి. ఈ దాడి సాకుగా రష్యా ప్రతిదాడికి పాల్పడే అవకాశాలు ఉన్నాయా? అనే కోణంలో వాదనలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా, యుద్ధంతో భారీ నష్టం వాటిల్లుతుందని తెలిసినా వ్లాదిమిర్ పుతిన్ ఎందుకు వెనక్కి తగ్గడం లేదని కొందరు నిపుణులు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ దేశంపై ఎందుకు అంత ఇంటరెస్ట్ వంటి ప్రశ్నలూ ముందుకు వస్తున్నాయి. ఈ అంశంపై కొందరు నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో పని చేసిన ఫియోనా హిల్ ప్రకారం, కొన్నేళ్లుగా పుతిన్ ఉక్రెయిన్‌పై గ్రిప్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2006 నుంచి ఆ దేశానికి గ్యాస్ కట్ చేశారు. పుతిన్ 22 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. అవకావశం వచ్చిన ప్రతిసారీ ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచారు. గతంలో తమ చెప్పుచేతల్లో ఉన్న ఉక్రెయిన్‌ను తిరిగి తమ పరిధిలోకి తెచ్చుకోవాని ఆయన ఉబలాటపడతారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ పని జరగాలని, ఆ తర్వాత 2036 వరకు ప్రెసిడెంట్‌గా కొనసాగాలని కలలు కంటున్నారు. ఆయన రష్యన్ సామ్రాజాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు. అందులో ఉక్రెయిన్ మాత్రం రష్యా నుంచి దూరంగా పశ్చిమ దేశాల వైపు వెళ్తున్నది. ఇది పుతిన్‌కు మింగుడు పడటం లేదు.