
Turkey earthquake: Death toll crosses 50k: టర్కీలో వరుస భూ ప్రకంపనల కారణంగా మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. భూకంప మరణాలు ఇప్పటికే 50 వేల మార్కును దాటాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. సిరియా ప్రాణానష్టం కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. టర్కీలో మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ భూ ప్రకంపనలు ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి.
ఫిబ్రవరి 6న టర్కీ, సిరియా ప్రాంతాల్లో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య శుక్రవారం నాటికి 50,000 దాటింది, టర్కీలో 44,000 మందికి పైగా మరణించినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. టర్కీలో భూకంపాల కారణంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారం రాత్రికి 44,218కి పెరిగిందని డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ (AFAD) తెలిపింది. సిరియా తాజాగా ప్రకటించిన మరణాల సంఖ్య 5,914కు చేరుకుంది. దీంతో రెండు దేశాలలో కలిపి భూకంప మరణాల సంఖ్య 50 వేల మార్కును అధిగమించింది.
భూకంపంతో నిరాశ్రయులైన 1.5 మిలియన్ల మందికి ఇళ్ల నిర్మాణం..
ఈ నెలలో సంభవించిన వినాశకరమైన భూకంపాల తర్వాత టర్కీ నిరాశ్రయులైన అక్కడి ప్రజలకు గృహాలను పునర్నిర్మించే పనిని ప్రారంభించిందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే టర్కీ, సిరియాలో మొత్తం మరణాల సంఖ్య 50,000 దాటింది. ఫిబ్రవరి 6న సంభవించిన వరుస భూకంపాలలో 520,000 అపార్ట్‌మెంట్‌లను కలిగి ఉన్న 160,000 భవనాలు కూలిపోయాయి. నెలరోజుల్లో ఎన్నికలను ఎదుర్కొన్న అధ్యక్షుడు రెసిప్ తైయిప్ ఎర్డోగన్ ఒక సంవత్సరంలోపు గృహాలను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే, అధికారులు వేగం కంటే భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తాజా భూకంపాల ధాటికి ప్రకంపనలను తట్టుకోలేని కొన్ని భవనాలు నేలకూలాయి. మళ్లీ సాధారణ భూకంపాలు సంభవిస్తే తట్టుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచిస్తున్నారు.
"అనేక ప్రాజెక్టుల కోసం, టెండర్లు-కాంట్రాక్టులు జరిగాయి. ప్రక్రియ చాలా వేగంగా సాగుతోంది, ఇదే సమయంలో భద్రతపై ఎటువంటి రాజీ ఉండదని" ఒక అధికారి తెలిపారు. భూకంపంతో నిరాశ్రయులైన చాలా మంది కోసం టెంట్లు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వాటిని యాక్సెస్ చేయడంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. "నాకు ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. మేము ఒక గుడారంలో నివసిస్తున్నాము. పైన గుడారం- కింద నేల తడిగా ఉంది. మేము మరిన్ని టెంట్లు అడుగుతున్నాము. కానీ ఇవ్వడం లేదు. ఈ పరిస్థితులు ఇబ్బంది కరంగానే ఉన్నాయని" బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, టర్కీ భూకంపం కారణంగా ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ప్రభుత్వ ప్రతిస్పందనలు అంతంతమాత్రంగానే ఉన్నాయని విమర్శలు వినిపించాయి. ప్రభుత్వం తగిన సాయం ప్రజలకు అందించడంలో విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎర్డోగన్ స్పందిస్తూ ప్రతిస్పందనలు నెమ్మదించడాన్ని అంగీకరించారు. అయితే, ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ కలిసికట్టుగా ముందుకు నడవాలని కోరారు. విమర్శలు, ఆరోపణలు చేసుకునే సమయం ఇది కాదని సూచించారు. మెరుగైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.