
అబుదాబి:అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) పర్యటన కోసం బుధవారం అబుదాబికి చేరుకున్నారు. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా ట్రంప్‌ను ఆత్మీయంగా ఆహ్వానించారు. ట్రంప్ ప్రయాణించిన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానాన్ని యుఏఈ ఫైటర్ జెట్‌లు దేశ గగనతలంలో ఎస్కార్ట్ చేయడం విశేషం.
ట్రంప్ తన పర్యటనలో అబుదాబిలోని ప్రముఖ షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు, ఖసర్ అల్ వతన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లను సందర్శించారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో వ్యాపార, రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో అమెరికా, యుఏఈ మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల అంశంపైనూ చర్చలు జరగనున్నాయి.
ఈ పర్యటనకు ముందు ట్రంప్ సౌదీ అరేబియా, ఖతార్ దేశాలకు కూడా వెళ్లారు. ఇప్పటి వరకు యుఏఈను సందర్శించిన రెండవ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గుర్తింపు పొందారు. గతంలో 2008లో జార్జ్ డబ్ల్యు బుష్ యుఏఈ పర్యటించారు.
ట్రంప్ తాజా పర్యటనతో అమెరికా-యుఏఈ సంబంధాలు మరింత బలపడనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య 1.4 ట్రిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు అమలులో ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు మరో 200 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. ట్రంప్ పూర్వంలో చేసిన ప్రకటనల ప్రకారం, ఈ ప్రాంతం నుంచి అమెరికాకు 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని చెప్పిన విషయం గమనార్హం.
ఈ పర్యటన ముగిసిన తర్వాత ట్రంప్ శుక్రవారం మధ్యాహ్నం యుఏఈ నుంచి తిరుగు ప్రయాణం చేయనున్నారు.