తూర్పు ఉక్రెయిన్‌లో కాల్పుల మోత.. రెచ్చగొట్టొద్దన్న పెద్దన్న, యూఎస్ రాయబారిని బహిష్కరించిన రష్యా

Siva Kodati |  
Published : Feb 17, 2022, 10:18 PM ISTUpdated : Feb 17, 2022, 10:20 PM IST
తూర్పు ఉక్రెయిన్‌లో కాల్పుల మోత.. రెచ్చగొట్టొద్దన్న పెద్దన్న, యూఎస్ రాయబారిని బహిష్కరించిన రష్యా

సారాంశం

తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలోని కాడివ్కాలో కాల్పుల మోత కలకలం రేపింది. రష్యా మద్దతు కలిగిన వేర్పాటువాదులు, ఉక్రెయిన్‌ సైనికుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం లేనప్పటికీ ఇద్దరు పౌరులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది.  

రష్యా (Russia) , ఉక్రెయిన్‌ (Ukraine) మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలని భావిస్తోన్న రష్యాకు కళ్లెం వేసేందుకు అమెరికా సారథ్యంలోని నాటో (nato) కూడా రెడీగా వుంది. సరిహద్దుల్లో ఇరువైపులా ఆయుధ సంపత్తి, భారీగా బలగాలు మోహరించి వుండటంతో అక్కడి పరిణామాలను యావత్‌ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలోనే తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలోని కాడివ్కాలో కాల్పుల మోత కలకలం రేపింది. రష్యా మద్దతు కలిగిన వేర్పాటువాదులు, ఉక్రెయిన్‌ సైనికుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం లేనప్పటికీ ఇద్దరు పౌరులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది.  

సరిహద్దు ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పట్ల ఇరుపక్షాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. సరిహద్దు ప్రాంతంలో గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులే కాల్పులు జరిపినట్లు ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వ బలగాలే తమపై కాల్పులు జరిపినట్లు వేర్పాటువాదులు అంటున్నారు. గడిచిన 24 గంటల్లో నాలుగుసార్లు కాల్పులు జరిపినట్లు వారు చెబుతున్నారు. సరిహద్దుల్లో సైన్యం మోహరించిన తరుణంలో రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.  

అటు ఉక్రెయిన్‌ ఆక్రమణకు ఓ కారణాన్ని చూపడంతోపాటు ఆ ప్రాంతంలో మారణహోమం సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తోంది. అయితే, ఉక్రెయిన్‌పై దాడి చేయాలని యోచిస్తున్నట్లు తమపై వచ్చిన ఆరోపణలను రష్యా ఖండించింది. సరిహద్దుల్లో మోహరించిన తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంటున్నామని.. ఇప్పటికే దాదాపు లక్షకుపైగా బలగాలను ఉపసంహరించినట్లు మాస్కో తెలిపింది. అయినప్పటికీ అమెరికా మాత్రం రష్యా ప్రకటనను నమ్మడం లేదు. ఇంకా వేల సంఖ్యలో రష్యా బలగాలు సరిహద్దుకు చేరుకుంటున్నట్లు ఆరోపించింది.  

Stanytsia Luhanskaపై జరిపిన వైమానిక దాడిలో కిండర్ గార్టెన్ నంబర్ 21 గోడకు రంధ్రం పడింది. డెపోవ్స్కా వీధిలోని భవనంలో తరగతులు అప్పటికే ప్రారంభమయ్యాయి. ఆట స్థలంలో శిథిలాలు ,ఇటుకలు చెల్లాచెదురుగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రాకెట్ దాడి జరిగినప్పుడు విద్యార్థులు మరొక గదిలో ఉండటంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. అయితే ఒక ఉపాధ్యాయుడు, లాండ్రీ కార్మికుడు, భద్రతా అధికారి గాయపడినట్లుగా తెలుస్తోంది. ఉక్రేనియన్ మిలిటరీ ప్రకారం.. నగరంలో 32 షెల్లు పడగా.. దాడి కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మరోవైపు.. అమెరికా డిప్యూటీ అంబాసిడర్‌ను రష్యా బహిష్కరించడం కలకలం రేపింది. అయితే అమెరికా అత్యున్నత రాయబారి జాన్ జె సుల్లివన్ మాత్రం ఇంకా మాస్కోలోనే వున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి సాధ్యమేనన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ.. రష్యా రెచ్చగొట్టే చర్యలను ఖండించారు. మరోవైపు తూర్పు ఉక్రెయిన్‌లో ఇటీవలి కాలంలో హింసాత్మక ఘటనలు పెరగడం పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని రష్యా వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్‌పై పశ్చిమ దేశాల ప్రభావం మరింత తీవ్రతరం కాకుండా నిరోధించాలని భావిస్తున్నట్లు క్రెమ్లిన్ గురువారం తెలిపింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?