ఆఫ్ఘనిస్తాన్: కాబూల్ ఎయిర్ పోర్టును దిగ్బంధించిన తాలిబన్లు.. రోడ్లన్నీ బ్లాక్‌, దారంతా చెక్‌పోస్ట్‌లే

By Siva KodatiFirst Published Aug 28, 2021, 9:49 PM IST
Highlights

ఉగ్రదాడులతో పాటు సంకీర్ణ దేశాలకు చెందిన ప్రజల తరలింపుకు విధించిన గడువు దగ్గరపడుతుండటంతో కాబూల్ లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయాన్ని తాలిబన్లు దిగ్బంధించారు. విమానాశ్రయం వద్దకు భారీ ఎత్తున ప్రజలు గుమికూడకుండా అదనపు దళాలను మోహరించారు. విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అదనపు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు
 

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో ఇక్కడి ప్రజలు దేశం విడిచి పారిపోతున్న సంగతి తెలిసిందే. అటు విదేశీయులను సైతం ఆయా దేశ ప్రభుత్వాలు స్వదేశానికి తరలిస్తున్నాయి. ఈ తరలింపు ప్రక్రియకు ఆగస్టు 31 వరకు తాలిబన్లు గడువు విధించిన నేపథ్యంలో.. కాబూల్‌ ఎయిర్‌పోర్టును వారు దిగ్బంధించారు. విమానాశ్రయ  పరిసరాల్లో తాలిబన్లు శనివారం అదనపు బలగాలను మోహరించారు. ఆగష్టు 15న అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి వేలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్తున్న విషయం తెలిసిందే.

అమెరికా సహా మిత్ర దేశాలు తమ దేశ ప్రజలతో పాటు, అఫ్గన్‌ శరణార్థులను కూడా విమానాల్లో తరలిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తమ పౌరులను అఫ్గనిస్తాన్‌లో ఉండాల్సిందిగా హెచ్చరించిన తాలిబన్లు... గురువారం నాటి ఐసిస్‌- కే ఘాతుకం తర్వాత చెక్‌ పోస్టుల వద్ద భద్రత మరింతగా పెంచారు. విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అంచెలంచెలుగా భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారులు బ్లాక్‌ చేస్తూ.. అడ్డుకుంటూ తాలిబన్‌ ఫైటర్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 

ALso Read:చైనాకు అమెరికా వార్నింగ్.. కరోనా మూలాలపై సమాచారాన్ని తొక్కిపెడుతున్నదన్న జో బైడెన్

కాగా ఇస్లామిక్‌ ఖోరసాన్‌ (ఐసిస్‌-కె) గ్రూపు కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద గురువారం జరిపిన వరుస పేలుళ్ల ఘటనలో దాదాపు 170 మంది అఫ్గన్‌ ప్రజలు, 13 మంది అమెరికా సైనికులు మృత్యువాత పడిన విషయం విదితమే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా శుక్రవారం.. నంగహర్‌ ప్రావిన్స్‌లోని ఐసిస్‌-కె టెర్రరిస్టుల కదలికలను గుర్తించి.. వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో భాగంగా కాబూల్‌ జంట పేలుళ్ల సూత్రధారిని మట్టుపెట్టినట్లు సమాచారం.

click me!