చైనాకు అమెరికా వార్నింగ్.. కరోనా మూలాలపై సమాచారాన్ని తొక్కిపెడుతున్నదన్న జో బైడెన్

By telugu teamFirst Published Aug 28, 2021, 6:43 PM IST
Highlights

కరోనా మూలాలకు సంబంధించిన సమాచారాన్ని చైనా దాచిపెడుతున్నదని అమెరికా తీవ్రస్థాయి మండిపడింది. తొలి నుంచీ ఇదే వైఖరి కొనసాగిస్తున్నదని, ఇప్పటికీ మహమ్మారి అనేక మంది ప్రాణాలను బలితీసుకుంటున్నా చైనా తీరు మారడం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లో ఆ సమాచారం తెలుసుకుని తీరుతామని, తద్వార భవిష్యత్‌లో మహమ్మారులను నివారించగలుగుతామని తెలిపారు.

న్యూఢిల్లీ: అగ్రదేశం అమెరికా చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కరోనా మూలాలను ఇప్పటికీ తొక్కిపెడుతున్నదని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. కరోనా మూలాలను తెలుసుకోవాల్సిన హక్కు ప్రపంచానికి ఉన్నదని స్పష్టం చేశారు. చైనా కావాలనే తొక్కిపెడుతున్నదని, అమెరికా ఈ వైఖరిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని, తమకు కావాల్సిన సమాచారాన్ని కచ్చితంగా రాబట్టుకుంటామని అన్నారు. కరోనా మూలాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు రిపోర్ట్ చేసిన తర్వాత బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘కరోనా మూలాలు కనుగొనడానికి మా ఇంటెలిజెన్స్ సిబ్బంది విశేష కృషిసల్పుతున్నారు. ఈ మహమ్మారి మూలాలను కచ్చితంగా కనుగొని తీరుతాం. తద్వారా భావి అంటురోగాలను నివారించడానికి వీలుచిక్కుతుంది.’ అని అన్నారు. ఆది నుంచీ చైనా అధికారులు మూలాలు కనుగొనడానికి చేసిన ప్రయత్నాలను అడ్డుకుంటూనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికీ కరోనా మరణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయని, కానీ, చైనా మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదని చెప్పారు. చైనా పారదర్శకంగా వ్యవహరించాలని, సమాచారాన్ని తొక్కిపెడుతున్నదని పేర్కొన్నారు.

ప్రపంచం సమాధానాలు తెలుసుకోవాల్సి ఉన్నదని, వాటిని వెతికే వరకూ తాము ఊరుకోబోమని బైడెన్ అన్నారు. బాధ్యత కలిగిన దేశాలు ప్రపంచం పట్ల తమ బాధ్యతను విస్మరించవద్దని వివరించారు. మహమ్మారులకు అంతర్జాతీయ సరిహద్దులుండవని  గుర్తెరగాలన్నారు. కాబట్టి, వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని, అందుకోసం వాటి మూలాలు తెలుసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. భావసారూప్య దేశాలతో తాము కలిసి చైనాపై ఒత్తిడి పెంచుతామని,  కరోనా వ్యాపించినప్పటి తొలినాళ్లలో దాని తీరు, ఆధారాలు, ఇతర కీలక సమాచారాన్ని పంచుకునే వరకూ వదిలిపెట్టబోమని జో బైడెన్ స్పష్టం చేశారు.

click me!