అమెరికా వదిలిపెట్టిన హెలికాప్టర్‌ను ఎగరేయాలని ప్రయత్నించి నేలకూల్చిన తాలిబాన్లు.. ముగ్గురు దుర్మరణం

By Mahesh KFirst Published Sep 10, 2022, 10:47 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వదిలిపెట్టిన పోయిన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను తాలిబాన్లు ఎగరేయాలని ప్రయత్నించారు. కానీ, అది విఫలమైంది. గాల్లోకి ఎగిరిన ఆ హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి.
 

న్యూఢిల్లీ: గతేడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన పరిణామాలు మన కళ్లముందు ఇంకా కదలాడుతున్నాయి. రోజుల వ్యవధిలో ఆ దేశ స్వరూపమే మారిపోయింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో పూర్తిగా తిరోగమన దారిలో పడిపోయింది. అమెరికా తన మిలిటరీని ఉపసంహరించుకుంది. డెడ్ లైన్ లోపు యూఎస్ మిలిటరీని, దాని ఆయుధ సంపత్తిని వెనక్కి తీసుకురాలేకపోయింది. దీంతో చాలా ఆయుధాలు, జిప్సీలు, యుద్ధ హెలికాప్టర్లను అక్కడే వదిలిపెట్టి వెనక్కి తరలి వెళ్లిపోయాయి. అయితే, తాలిబాన్లు వాటిని వినియోగించకూడదనే లక్ష్యంతో యూఎస్ మిలిటరీ ఉద్దేశపూర్వకంగా చాలా వాటిని ధ్వంసం చేసింది. అలా ధ్వంసం చేసినా కూడా చాలా ఆయుధాలు, ఇతర వాహనాలు తాలిబాన్లకు లభించాయి. వాటిపై నియంత్రణ పొందడానికి సాధన చేస్తున్నది. తద్వార వాటిని  వినియోగించుకోవాలని చూస్తున్నది.

ఈ క్రమంలోనే అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లోనే వదిలిపెట్టిన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను తాలిబాన్లు గాల్లోకి ఎగిరించే ప్రయత్నం చేశారు. కానీ, దానిపై వారు పట్టు సాధించలేకపోవడంతో నేల కూలిపోయింది. ఆ చాపర్ క్రాష్ కారణంగా ముగ్గురు మరణించారు. మరో ఐదుగురు గాయపడినట్టు తాలిబాన్ ప్రభుత్వంలో డిఫెన్స్ మినిస్ట్రీ స్పోక్స్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ఇనాయతుల్లా ఖోరాజ్మీ మాట్లాడారు. 

ఒక అమెరికన్ బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను తాము మిలిటరీ ట్రైనింగ్ కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. దీన్ని శిక్షణలో భాగంగా టేకాఫ్ చేశారని వివరించారు. నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ చాపర్‌ను గాల్లోకి ఎగిరించిన తర్వాత అందులో ఓ సాంకేతికత సమస్య తలెత్తిందని తెలిపారు.

click me!