మహిళల హక్కులకు ప్రాధాన్యత ఇవ్వం : అంతర్జాతీయ సమాజానికి తేల్చిచెప్పిన తాలిబన్లు

By Siva KodatiFirst Published Jan 15, 2023, 3:43 PM IST
Highlights

తాలిబన్ల ఏలుబడిలో మహిళలు బిక్కుబిక్కుమంటున్నారు. ఒక్కొక్క హక్కును కోల్పోతూ.. కఠినమైన షరియా చట్టం నీడలో బతుకుతున్నారు. అంతర్జాతీయ సమాజం ఎన్ని విధాలుగా చెప్పి చూసినా తాలిబన్లు తమ పద్దతి మార్చుకోవడం లేదు. 

అధికారంలో వస్తే మంచి పాలన అందిస్తామని, స్త్రీలకు కూడా చదువుకునేందుకు ,ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పిన తాలిబన్ల మాటలు నీటి మీద రాతలే అయ్యాయి. తాలిబన్లు అధికారం అందుకున్న రోజున లక్షలాది మంది ఆఫ్ఘాన్లు దేశం విడిచి ఎందుకు పారిపోయారో ... వారంతా ఎందుకు భయపడ్డారో ఇప్పుడు ఆ ఘటనలే దేశంలో జరుగుతున్నాయి. అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చేందుకు గాను తాము మారిపోయినట్లుగా నటించారు. కానీ పోను పోను మానవహక్కులను తుంగలో తొక్కడం ప్రారంభించారు. స్త్రీలపై ఒక్కొక్కటిగా కఠిన నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. తాజాగా తాలిబన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. మహిళలపై ఆంక్షలను రద్దు చేయడం సరికాదన్నారు. 

ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘించే ఎలాంటి చర్యలను తాము అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళల హక్కులపై ఆంక్షలకు సంబంధించిన ఆందోళనలను దేశంలో ఏర్పాటు చేసిన గ్రూపు నియమాల ప్రకారం పరిష్కరించుకుంటామని తాలిబన్ నేత తెలిపారు. షరియా చట్టానికి అనుగుణంగా అన్ని విషయాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తామని.. దేశంలో షరియాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని పాలక ప్రభుత్వం అనుమతించదన్నారు. 

Also REad: ఆఫ్ఘన్‌లో అమల్లోకి షరియా చట్టం.. బహిరంగంగా కొరడా దెబ్బలు, మహిళలకి సైతం

ఇక తాజాగా ఎన్జీవోలలో మహిళలు పనిచేయకుండా తాలిబన్లు నిషేధం విధించడంతో ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా మహిళా విశ్వవిద్యాలయ విద్యార్ధులు, మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అటు అంతర్జాతీయ సమాజం కూడా దీనిని ఖండించింది. అమెరికా, యూకే, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి, ఓఐసీ తదితర అంతర్జాతీయ సహాయ సంస్థలు , దేశాలు తాలిబన్ల చర్యను ఖండించాయి. ఆగస్ట్‌లో విడుదల చేసిన యూనిసెఫ్ నివేదిక ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికలు మాధ్యమిక విద్యకు దూరమవుతున్నారట. 

ఇదిలావుండగా.. జనవరి 13న 11 దేశాలు ఆఫ్ఘనిస్తాన్‌‌లో మహిళలు, బాలికలపై వున్న అన్ని ఆంక్షలను తొలగించాలని కోరాయి. వారిని తిరిగి ప్రజా జీవితంలోకి అనుమతించి విద్యను, ఉపాధిని పొందేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. అయినప్పటికీ తాలిబన్ ప్రభుత్వ యంత్రాంగం ఈ డిమాండ్‌ను ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే అన్ని ముస్లిం మెజారిటీ దేశాల ప్రాతినిథ్యం వున్న ఇంటర్ గవర్నమెంటల్ గ్రూప్ అయిన ఇస్లామిక్ కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఓఐసీ).. తాలిబన్ల తీరును తప్పుబట్టింది. లింగం ఆధారంగా పరిమితులను తొలగించాలని.. మహిళలు, బాలికలు వారి హక్కులను పొందేందుకు వీలు కలిగించాలని ఓఐసీ కోరింది. 

click me!