
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ తాలిబన్ల పాలన షురు అయిన తర్వాత ఆ దేశంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో మతపరమైన మైనారిటీలు, ముఖ్యంగా సిక్కు సమాజం లక్ష్యంగా దాడులు ఎక్కువయ్యాయి. గత రెండేళ్లుగా గురుద్వారాలపై జరిగిన ఘోరమైన దాడుల తర్వాత తాలిబన్లు హిందూ, సిక్కు సంఘాలను తిరిగి రావాలని కోరారు. తాలిబాన్ రాష్ట్ర మంత్రి కార్యాలయం డైరెక్టర్ జనరల్ విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ లో మైనారిటీ వర్గాలకు భద్రతా పరమైన సమస్యలు పరిష్కరించబడ్డాయి. హిందూ, సిక్కు సమూహాల వారు తిరిగి రావాలని కోరుతున్నామని అందులో పేర్కొన్నారు. జూలై 24న, రాష్ట్ర మంత్రి కార్యాలయ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ముల్లా అబ్దుల్ వాసీ, కాబూల్‌లో సిక్కు, హిందూ నాయకుల ప్రతినిధి బృందాన్ని కలుసుకుని, తిరిగి రావాలని అభ్యర్థించారు.
ఆఫ్ఘనిస్తాన్ లో మతపరమైన మైనారిటీలు, ముఖ్యంగా సిక్కు సమాజం లక్ష్యంగా ఉంది. జూన్ 18న, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) కాబూల్‌లోని కార్తే పర్వాన్ గురుద్వారాపై దాడి చేసింది. ఆఫ్ఘన్ భద్రతా సిబ్బందితో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దాడి జరిగిన సమయంలో దాదాపు 30 మంది ఉన్నారు. ముష్కరులు కాల్పులు జరపడంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు తీశారు. దాడిలో ధ్వంసమైన గురుద్వారాను ఆఫ్ఘన్ ప్రభుత్వం పునరుద్ధరించింది. అక్టోబర్ 2021లో, 15 నుండి 20 మంది ఉగ్రవాదులు కాబూల్‌లోని కార్ట్-ఎ-పర్వాన్ జిల్లాలోని గురుద్వారాలోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. మార్చి 2020 లో కాబూల్‌లోని షోర్ బజార్‌లోని శ్రీ గురు హర్ రాయ్ సాహిబ్ గురుద్వారా వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో కనీసం 25 మంది సిక్కులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి బాధ్యత వహించారు.
కాగా, గత వేసవిలో తమ దేశం తాలిబాన్ చేతిలో వెళ్లడంతో అనేక మంది అక్కడి నుంచి పారిపోయి ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఇదివరకు సాగించిన తాలిబన్ రాక్షస పాలనకు భయపడి అక్కడి నుంచి పెద్దఎత్తున ప్రజలు ఇతర దేశాలకు పారిపోయారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ నుండి 78,000 కంటే ఎక్కువ మంది ఆఫ్ఘన్‌లు పునరావాసం కోసం అమెరికా చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దేశాలకు సైతం అనేక మంది పారిపోయారు. అయితే, సరిహద్దు దేశాలు సరిహద్దులను మూసివేయడంతో తమ పిల్లలను కంచెలపై నుంచి విసిరేసిన ఘటనలు అక్కడి దారుణ పరిస్థితులకు అద్దంపట్టాయి. తాలిబన్లు అధికారం స్వాధీనం చేసుకున్న తర్వాత.. అక్కడి పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. అనేక ప్రపంచ దేశాలు తాలిబన్ సర్కారును గుర్తించేది లేదని పేర్కొంటూ ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలోనే ఆర్థిక ఆ దేశ పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. తాలిబన్ సర్కారు పెద్దగా ప్రజా సంక్షేమం పై దృష్టి సారించని కారణంగా దేశంలో సగం మంది ఆకలి కొరల్లోకి జారుకుంటున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉండే అవకాశముందని వెల్లడిస్తున్నాయి.