taliban: కాబూల్ ఎయిర్‌పోర్టులో తొక్కిసలాట, ఉద్రిక్తతలు.. విమాన సేవలు బంద్

By telugu teamFirst Published Aug 16, 2021, 1:09 PM IST
Highlights

కాబూల్ విమానాశ్రయంలో ప్రజల పోటెత్తారు. తాలిబన్ చెర నుంచి తప్పించుకోవడానికి నిన్న రాత్రి నుంచే భారీగా వచ్చి చేరారు. విమానాలు ఎక్కడానికి తొక్కిసలాట జరిగింది. పరిప్థితులు ఉద్రిక్తతను తలపిస్తున్నాయి. ఇదే తరుణంలో ఆఫ్ఘనిస్తాన్ గగనతలాన్ని మూసేయడంతో విమానరాకపోకలు నిలిచిపోయాయి. తొక్కిసలాట, దోపిడీలు జరక్కుండా పరిస్థితులను అదుపులోకి తేవడానికి అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. అనంతరం కొంత సేపటికి మరోసారి పెద్దస్థాయిలో జరిగింది. ఇది ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటికి ముగ్గురు మరణించినట్టు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ గగనతలాన్ని మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం కాబూల్ నుంచి విమానాల రాకపోకలు రద్దయ్యాయి. భారత్ నుంచి బయల్దేరనున్న ఎయిర్ ఇండియా విమాన ప్రయణాన్ని నిలిచిపోయింది.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో క్షణక్షణానికి పరిస్థితులు మారిపోతున్నాయి. ఏ నిమిషాన ఎలాంటి ఉపద్రవం ఎదురవుతుందో అర్థంకాని దుస్థితి నెలకొంది. తాలిబన్ల చెర నుంచి తప్పించుకోవాలని ఆరాటంతో ప్రజలు కాబూల్ ఎయిర్‌పోర్టుకు పోటెత్తారు. ఇతర దేశాల దౌత్య సిబ్బంది, పౌరులూ ఇందులో ఉన్నారు. పెద్దమొత్తంలో ప్రజలు విమానశ్రయంలో గుమిగూడటం, విమానాల్లోకి ఎక్కడానికి పాట్లుపడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఈ తరుణంలోనే కాబూల్‌లో గన్ ఫైరింగ్ చోటుచేసుకుంది. పెద్దస్థాయిలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ముగ్గరు మరణించినట్టు సమాచారం. 

ఇదే తరుణంలో అధికారులు ఆఫ్ఘనిస్తాన్ గగనతలంపై ఆంక్షలు విధించారు. గగనతలాన్ని మూసివేస్తూ అధికారులు ఓ నోటీసు జారీ చేశారు. దీంతో కాబూల్‌కు విమానాల రాకపోకలను రద్దుచేసినట్టయింది. హమీద్ కర్జాయ్ ఎయిర్‌పోర్టు నుంచి ఎలాంటి కమర్షియల్ ఫ్లైట్స్ సేవలందించబోవని కాబూల్ ఎయిర్‌పోర్టు అథారిటి వెల్లడించింది. దోపిడీ, దొంగతనాలు, తొక్కిసలాటను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దయచేసి విమానాశ్రయానికి రావద్దని విజ్ఞప్తి చేసింది.

నిలిచిన ఎయిర్ ఇండియా ఫ్లైట్:
ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న వారిని భారత్‌కు తీసుకురావడానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆ దేశానికి వెళ్లాల్సి ఉంది. కానీ, గగనతల సేవలను మూసివేయడంతో ఇది సాధ్యపడటం లేదు. ‘ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్‌స్పేస్‌ను క్లోజ్ చేశారు. ఏ విమానమైనా ఎలా వెళ్లగలదు? ఇప్పటికైతే మేం 12.30గంటలకు కాబూల్‌కు పంపాలనుకున్న విమానాన్ని పంపలేకపోతున్నాం’ అని ఎయిర్ఇండియా వర్గాలు వెల్లడించాయి. కాబూల్ ఎయిర్‌పోర్టు అధికారులు తీసుకునే నిర్ణయాలు ఆ దేశం మొత్తానికి వర్తిస్తాయి. దీంతో ఆ దేశ గగనతలం గుండా విమానాలేవీ రావడానికి, పోవడానికి వీల్లేకుండా మారింది.

విమానాల రూట్‌లలో మార్పులు
ఆఫ్ఘన్ గగనతలం మూసి ఉండటంతో అమెరికా నుంచి భారత్‌కు వస్తున్న విమానాల రూట్‌లలో మార్పులు చేశారు. చికాగో నుంచి న్యూఢిల్లీకి వచ్చే విమానం ఆఫ్ఘనిస్తాన్‌లో ఆగి.. రీఫ్యూయెల్ చేసుకుని భారత్‌కు రావల్సి ఉంటుంది. కానీ, తాజా ఆంక్షలతో ఏఐ-126(చికాగో-న్యూఢిల్లీ), ఏఐ-174(శాన్‌ఫ్రాన్సిస్కో-న్యూఢిల్లీ)లు ఇంధనాన్ని నింపుకోవడానికి గల్ఫ్ దేశాల గుండా మనదేశానికి చేరనున్నాయి.

కాబూల్ వచ్చే అన్ని ట్రాన్సిట్ విమానాలు తమ మార్గాలను మార్చుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ వైమానిక అధికారులు స్పష్టం చేశారు. కాబూల్ గగనతలం గుండా వచ్చే విమానాలను తాము కంట్రోల్ చేయడం లేదని వివరించారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఈ నేపథ్యంలోనే ఓ కీలక ట్వీట్ చేసింది. చికాగో  నుంచి ఢిల్లీ చేరనున్న ఫ్లైట్ ఈ తరుణంలోనే ఆఫ్ఘనిస్తాన్ గగనతలంలోకి వెళ్లి వెంటనే వెనక్కి వచ్చిందని తెలిపింది. బాకు నుంచి ఢిల్లీ వస్తున్న టెర్రా ఏవియా ఫ్లైట్ కూడా తన దారి మార్చుకున్నట్టు వెల్లడించింది.

click me!