Taliban: పాత పద్ధతిలోనే పాలన.. అన్నింటికీ షరియా చట్టం తప్పనిసరి

By telugu teamFirst Published Sep 8, 2021, 12:39 PM IST
Highlights

ప్రపంచమంతా ఇన్నాళ్లు భయపడుతున్న నిర్ణయాలను క్రమంగా తాలిబాన్లు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వంలో మెజార్టీగా ఉగ్రవాదులకే బాధ్యతలు అప్పగించి తమ పాలన గతం మాదిరే ఉంటుందని పరోక్షంగా ప్రకటించారు. అన్ని విషయాలకూ షరియాను కచ్చితంగా వర్తింపజేస్తామని తెలిపారు.
 

న్యూఢిల్లీ: తాలిబాన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వంపై ప్రపంచవ్యాప్తంగా కలవరం మొదలైంది. ఓ ఉగ్రవాదిని ప్రధానిగా నియమించడం, కరడుగట్టిన ఉగ్రవాదిగా ఇప్పటికీ యూఎన్ జాబితాలో ఉన్న హక్కానీ నెట్‌వర్క్ టెర్రరిస్టు సిరాజుద్దిన్‌కు అంతర్గత భద్రత బాధ్యతలివ్వడం అన్ని దేశాలకూ ఆందోళనకరంగా మారింది. తాము మారినట్టు కలర్ ఇచ్చిన తాలిబాన్లు చివరికి వారి నిజస్వరూపాన్నే ఈ ప్రకటనతో బట్టబయలు చేసుకున్నారు. అంతేకాదు, ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ప్రకటన కూడా అంతే కలవరాన్ని కలిగిస్తున్నది.

‘భవిష్యత్‌పై ఎవరూ బెంగపడవద్దు. న్యాయసమ్మతంగా, సహేతుకంగానే ప్రస్తుతమున్న సమస్యలను పరిష్కరించడం మా ప్రథమ కర్తవ్యం’ అని ప్రకటించింది. ‘గత ఇరవై ఏళ్ల మా పోరాటానికి ప్రధానంగా రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి విదేశీ ఆక్రమణ నుంచి దేశాన్ని విముక్తం చేయడం, రెండోది, ఇస్లామిక్ విధానంలో స్వతంత్ర, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం’ అని వివరించింది. వీటికితోడు 1996 నుంచి 2001లో అనుసరించిన దుష్టపాలననే పునరావృతం చేయనున్నట్టూ ప్రకటించారు. ‘ఆఫ్ఘనిస్తాన్‌లో పాలన, జీవనాన్ని అన్ని కోణాల్లోనూ షరియా చట్టానికి అనుగుణంగా సాగేలా నియంత్రిస్తాం’ అని తెలిపారు.

ఈ ప్రకటనతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగానున్న హక్కుల కార్యకర్తల్లో ఆందోళనలు వెలువడుతున్నాయి. మహిళా హక్కుల మంటగలుస్తాయని, సాధికారత వంటింటికి చేరుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ తిరోగమన దారి పట్టే ముప్పు ఉందని చెబుతున్నారు.

తాలిబాన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ప్రధానిగా ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ బాధ్యతలు చేపట్టనున్నారు. నిర్ణయాలు తీసుకునే మండలి ‘రెహబరి షురా’కు ఆయనే సారథి. మొదటి నుంచి తాలిబాన్ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తాడని వార్తలు వచ్చిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ మాత్రం హసన్ అఖుండ్‌కు డిప్యూటీగా ఉండనున్నారు. ఈ విషయం విశ్లేషకులనూ ఆశ్చర్యపరిచింది. తాలిబాన్‌ను వ్యవస్థాపించిన ముల్లా ఒమర్ తనయుడికి రక్షణ శాఖను అప్పగించారు.

click me!