మేం కారణం కాదు, అయినా క్షమించండి: భారత జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మృతిపై తాలిబన్ల స్పందన

By Siva KodatiFirst Published Jul 17, 2021, 8:04 PM IST
Highlights

భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మరణానికి తాము కారణం కాదని తాలిబన్లు ప్రకటించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే జర్నలిస్టులు యుద్ధ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నారని... ఏది ఏమైనా సిద్ధిఖీ మరణానికి తమను క్షమించాల్సిందిగా ముజాహిద్ తెలిపారు. 

శుక్రవారం ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు, దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో భారత్‌కు చెందిన ప్రముఖ ఫోటో జర్నలిస్ట్‌, పులిట్జర్‌ అవార్డ్‌ గ్రహీత డానీష్‌ సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోవడంపై తాలిబన్లు స్పందించారు. ఆయన మృతికి తాము కారణం కాదంటూ స్పష్టం చేశారు. అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్ఎన్‌- న్యూస్ 18తో తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ మాట్లాడుతూ... డానీష్ ఎవరి కాల్పుల వల్ల మరణించారో తమకు తెలియదని పేర్కొన్నారు. అసలు అతను ఎలా చనిపోయాడో తమకు తెలియదని ముజాహిద్ వెల్లడించారు.

డానీష్ మరణంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కానీ వార్ జోన్‌లలోకి ప్రవేశించేటప్పుడు జర్నలిస్టులు ముందస్తు సమాచారం ఇవ్వాలని ముజాహిద్ స్పష్టం చేశారు. అలాంటి సమయాల్లో పాత్రికేయుల ప్రాణాలకు అపాయం కలగకుండా చూసుకుంటామని ఆయన తెలిపారు. కానీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే జర్నలిస్టులు యుద్ధ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నారని... ఏది ఏమైనా సిద్ధిఖీ మరణానికి తమను క్షమించాల్సిందిగా ముజాహిద్ తెలిపారు. 

కాగా పులిట్జర్ బహుమతి గ్రహీత అయిన డానీష్ సిద్ధిఖీ.. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌లో ఫోటో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. జూలై 15న ఆఫ్గనిస్తాన్‌లొని కాందహార్‌ సమీపంలోని స్పిన్ జిల్లాలో తాలిబాన్లు, ఆఫ్గన్ సైన్యం మధ్య జరిగిన ఘర్షణలను కవర్ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. డానీష్ సిద్ధిఖీ మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీకి తాలిబన్లు అప్పగించారు. ఈ విషయాన్ని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.
 

click me!