సోలోమన్ దీవుల్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

By Sumanth KanukulaFirst Published Nov 22, 2022, 9:22 AM IST
Highlights

సోలమన్ దీవులలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.0 గా నమోదైంది.

సోలమన్ దీవులలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.0 గా నమోదైంది. నైరుతి తీరంలో భూకంపం సంభవించినట్టుగా అధికారులు చెబుతున్నారు. మలాంగో ప్రాంతానికి నైరుతి దిశలో 16 కి.మీ (10 మైళ్లు) దూరంలో.. 15 కి.మీ (9 మైళ్లు) లోతులో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల (185 మైళ్ళు) లోపు సోలమన్ తీర ప్రాంతంలో సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. 

మరోవైపు సోలమన్ దీవులలోని ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు కోరారు. భూకంపం వల్ల చాలా చోట్ల ఆఫీస్ టేబుల్స్, కంప్యూటర్స్ పూర్తిగా విసిరివేయబడ్డాయి, చాలా భయానకంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే రాజధాని హోనియారా భవనాలకు పెద్దగా నష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే భూకంపం వల్ల చోటుచేసుకున్న నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే..  ఇండోనేషియాలోని వెస్ట్ జావా ప్రావిన్స్ లో సోమవారం సంభవించిన భారీ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 162కు చేరుకుంది. వంద‌లాది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తాకు ఆగ్నేయంగా 75 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణానికి సమీపంలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు చ‌నిపోయిన వారి సంఖ్య 162కు చేరుకుందని వెస్ట్ జావా గవర్నర్ రిద్వాన్ కామిల్ ఇన్ స్టాగ్రామ్ లో తెలిపారు. అలాగే, గాయ‌ప‌డ్డవారి సంఖ్య వంద‌ల్లో ఉంద‌ని పేర్కొన్నారు. 

ఇండోనేషియా విపత్తు నివారణ సంస్థ (బీఎన్‌సీబీ) ఇప్పటికీ భూకంపంలో చ‌నిపోయిన వారి సంఖ్య 62గా ఉంద‌ని పేర్కొంది. అయితే, శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్న మ‌రో 25 మంది కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతున్నారు. అలాగే, గాయ‌ప‌డ్డ‌వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. 

భూకంపం కార‌ణంగా ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్య‌లో భ‌వ‌నాలు కూలిపోయాయి. దీంతో మ‌ర‌ణాల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని ఆయ‌న తెలిపారు. ఎందుకంటే శిథిలాల కింద పెద్ద సంఖ్య‌లో జ‌నాలు చిక్కుకుపోయి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. "ఏకాంత ప్రదేశాలలో చిక్కుకున్న నివాసితులు ఉన్నారు ... కాబట్టి గాయపడిన వారితో పాటు మరణాల సంఖ్య కాలక్రమేణా పెరుగుతుందని మేము అంచనా వేస్తున్నాము" అని ఆయ‌న తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
 

click me!