
Sri Lanka economic crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ప్రజా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. శ్రీలంక అధ్యక్ష పదవికీ గొటబయ రాజపక్సే రాజీనామా చేయడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రభుత్వ పదవుల నుంచి వైదొలగారు. అయినప్పటికీ శ్రీలంకలో నిరసనలు ఆగడం లేదు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం మధ్య, తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే పదవిని చేపట్టారు. అయితే, ప్రస్తుతం ఆయన రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ మంగళవారం కొలంబోలో నిరసనలు చెలరేగాయి. నిరసనకారులు రణిల్ విక్రమసింఘేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులు అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. “ఇటీవల దేశ అధ్యక్షుడిని (గొటబయ రాజపక్సే) ప్రజలు బలవంతంగా రాజీనామా చేయించారు. అతను రాజీనామా చేసినప్పుడు, తదుపరి అధ్యక్షుడిగా నియమించిన ప్రధానమంత్రిని నియమించాలని నిర్ణయం తీసుకున్నాడు. తాత్కాలిక అధ్యక్షుడికి ప్రజల ఆదేశం లేదు. కాబట్టి తాత్కాలిక అధ్యక్షుడిగా శాశ్వత అధ్యక్షుడిగా మారడానికి ఒక ఎత్తుగడతో ముందుకు సాగుతున్నారు” అని ఆరోపించారు.
"మేము ఆందోళన చేస్తున్నాము.. ఆయన స్థానాన్ని వ్యతిరేకిస్తున్నాము.. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసిఘే రాజీనామా చేసే వరకు నిరసన తెలుపుతాము" అని మరో నిరసనకారుడు పేర్కొన్నాడు. రణిల్ విక్రమసింఘే సరైన ప్రజల అభీష్టంతో రాలేదని నిరసనకారులు వాదించారు. "అతను ఇదివరకటి పాలన ద్వారా నియమించబడ్డాడు. ఆ అవినీతి పాలన విక్రమసింఘేకు మద్దతిస్తోంది. కాబట్టి మేము అతనిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నామని” అని నిరసనకారులు చెప్పారు. భారీ నిరసనల నేపథ్యంలో గత వారం గోటబయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తర్వాత పార్లమెంటు స్పీకర్ మహింద యాపా అబేవర్దన, అప్పటి ప్రధానిగా ఉన్న విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారని, జూలై 20న కొత్త అధ్యక్షుడి కోసం పార్లమెంటు సభ్యులు ఓటు వేసే అవకాశం ఉంటుందని ప్రకటించారు.
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, శ్రీలంక పోడుజన పెరామునా (ఎస్ఎల్పీపీ) పార్లమెంటేరియన్ దుల్లాస్ అలహపెరుమా, నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) నేత అనురా కుమార దిసానాయకేలను మంగళవారం పార్లమెంట్ అధ్యక్ష పదవికి నామినేట్ చేశారు. బుధవారం ఉదయం పార్లమెంటు సభ్యులు సమావేశమై శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ముందుగా రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేసిన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస తన రాష్ట్రపతి నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం నాడు ప్రకటించారు.శ్రీలంక తదుపరి అధ్యక్షుడికి జరిగే ఓటింగ్ లో తమ పార్టీ సమాగి జన బాలవేగయ (ఎస్ జేబీ) అలహపెరుమాకు మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. కాగా, శ్రీలంక స్వాతంత్య్రం పొందిన తర్వాత ఎప్పుడూ చూడని ఆర్థిక సంక్షోభాన్ని (Sri Lanka economic crisis) నేడు ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. చమురు ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్లర్లు, నిరసనలను అదుపులోకి తీసుకురావడానికి తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించారు.