Sri Lanka Crisis: శ్రీలంకలో ముదిరిన సంక్షోభం..మైనార్టీలో రాజపక్స సర్కారు !

Published : Apr 05, 2022, 04:41 PM IST
Sri Lanka Crisis: శ్రీలంకలో ముదిరిన సంక్షోభం..మైనార్టీలో రాజపక్స సర్కారు !

సారాంశం

Sri Lanka Crisis: శ్రీలంక‌లో ఆర్థిక సంక్షోభం మ‌రింత‌గా ముదురుతోంది. ఎస్ఎల్ పీపీ (SLPP) నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం నుండి 40 మంది ఎంపీలు వైదొలిగారు. దీంతో రాజ‌ప‌క్స ప్ర‌భుత్వం మైనార్టీలో ప‌డింది.   

Sri Lanka Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మ‌రింత‌గా ముదురుతోంది. ఆ దేశ‌ అధ్యక్షుడు గొటబయా రాజపక్స నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి ప‌లు పార్టీలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో అక్క‌డి స‌ర్కారు  మైనార్టీలో పడిపోయింది. ఎస్ఎల్ పీపీ (SLPP) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఇప్ప‌టివ‌కు 41 మంది  పార్ల‌మెంట్ స‌భ్యులు బయటకు వ‌చ్చారు. 11 మంది ఎంపీలతో కలిసి తాము ప్రత్యేక స్వతంత్ర గ్రూపుగా ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు పార్లమెంటు సభ్యుడు అనురా ప్రియదర్శన యాపా శ్రీలంక పార్లమెంటుకు తెలియజేశారు. సంకీర్ణ ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్టు పేర్కొన్నారు. 

అలాగే, మాజీ మంత్రి విమల్ వీరవంశా కూడా ఇదే బాట పట్టారు. తాను, 16 మంది ఎంపీలు ప్రత్యేక స్వతంత్ర గ్రూపుగా ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు పార్లమెంటుకు తెలియజేశారు. సంకీర్ణ ప్ర‌భుత్వం తాము భాగ‌స్వాములుగా కొన‌సాగ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. వీరితో పాటు శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, 15 మంది ఎస్‌ఎల్‌ఎఫ్‌పి ఎంపీలతో కలిసి తాము ప్రత్యేక స్వతంత్ర గ్రూపుగా ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు పార్లమెంటుకు తెలియజేశారు. దీంతో సంకీర్ణ ప్ర‌భుత్వం నుంచి వైదొల‌గిన పార్ల‌మెంట్ స‌భ్యుల సంఖ్య 41 దాటింది. 

అధిక సంఖ్య‌లో సంకీర్ణ ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో మైనార్టీలోకి జారుకుంది స‌ర్కారు. ఈ క్ర‌మంలోనే అధ్యక్షుడు గొటబయా రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ప్ర‌జ‌లు సైతం పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్నారు. కాగా, సంక్షోభం నేప‌థ్యంలో శ్రీలంక మంత్రివర్గం ఆదివారం అర్థరాత్రి వ‌ర‌కు సాగిన స‌మావేశం అనంత‌రం.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 26 మంది మంత్రులు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ విష‌యాన్ని విద్యాశాఖ మంత్రి తెలిపారు. అయితే, మహింద రాజపక్సే ప్రధానిగా కొనసాగుతారు. శ్రీ‌లంక ప్ర‌ధాని మ‌హింద రాజ‌ప‌క్స త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేద‌ని ఆయ‌న కార్యాల‌యం ఆదివారం రాత్రి పేర్కొంది. మ‌హింద రాజ‌ప‌క్స రాజీనామా వార్త‌ల‌ను కొట్టి పారేసింది. ఆయ‌న‌కు అటువంటి ప్ర‌ణాళిక‌లే లేవ‌ని శ్రీ‌లంక పీఎంవో తేల్చేసింది.

దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా ప్ర‌జ‌లు ఉద్య‌మిస్తూ.. రాజపక్స కుటుంబ రాజకీయ నాయకులను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ త‌రుణంలో శ్రీలంక కొత్త ఆర్థిక మంత్రి అలీ సబ్రీ ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత మంగళవారం (ఏప్రిల్ 5) రాజీనామా చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంపై పెరుగుతున్న ప్రజల అశాంతి మధ్య ఆయ‌న రాజీనామా దేశ ప‌రిస్థితుల‌పై మ‌రింత ప్ర‌భావం చూపే అవ‌కాశాలున్నాయి. "నేను తక్షణమే ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను" అని రాష్ట్రపతికి రాసిన లేఖలో అలీ సబ్రీ తెలిపారు.

ఇదిలావుండగా, ఆర్థిక సంక్షోభంపై నిరసనల మధ్య ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రతిపక్ష నాయకుడు ప్రేమదాస డిమాండ్ చేశారు. "దాదాపు 20 సంవత్సరాలుగా ప్రతి నాయకుడు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీని రద్దు చేస్తామని వాగ్దానం చేశారు, కానీ దానిని బలపరిచారు. శ్రీలంక సర్వశక్తిమంతమైన కార్యనిర్వాహక అధ్యక్షత్వాన్ని రద్దు చేసి పార్లమెంటును బలోపేతం చేయాలి" అని ప్రేమదాస అన్నారు. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో ఎలాంటి హింసాత్మక చర్యలు చోటుచేసుకోకుండా భద్రతా దళాలు చర్యలు తీసుకుంటాయని రక్షణ కార్యదర్శి కమల్ గుణరత్నే మంగళవారం తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే