
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ (Ukraine) నగరాలను ఒక్కోదాన్ని టార్గెట్ చేసుకుంటూ రష్యా (Russia) దాడులు చేస్తున్నది. తాజాగా, ఉక్రెయిన్‌లో యూరప్‌లోనే అతిపెద్దదైన అణు విద్యుత్ కేంద్రంపై దాడి చేసింది. దీంతో ఉక్రెయిన్ సహా ప్రపంచ దేశాలు ఆందోళన చెందాయి. అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడులు ఆపాలని, అది పేలితే.. చెర్నోబిల్ కంటే కూడా పది రెట్లు ఎక్కువ విధ్వంసం ఉంటుందని ఉక్రెయిన్ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, రష్యా వెనుకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ముందు నుంచీ రష్యాను వ్యతిరేకిస్తున్న అమెరికా సహా యూరప్ దేశాలు ఆ దేశ అధ్యక్షుడిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా సీనియర్ సెనేటర్ (America Senator) లిండ్సే గ్రాహమ్ వివాదాస్పద పిలుపు ఇచ్చారు. రష్యాలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)ను చంపేవారే(Assassination) లేరా? ఆయనను హతమార్చి ప్రపంచానికి మేలు చేయండి అంటూ పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ కల్లోలానికి అంతం పలికేది ఎలా? రష్యాలోనే ఎవరో ఒకరు ఆ పని చేయాలి. ఈ మనిషి తీసేయాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయన ట్విట్టర్‌లో ఆయన అసంతృప్తిని మరింత వెళ్లగక్కారు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పేవారు రష్యా ప్రజలే అంటూ ట్వీట్ చేశారు. ‘రష్యాలో ఓ బ్రూటస్ ఉన్నాడా?’ అని అడిగారు.
అమెరికా సెనేటర్ మార్కస్ జూనియస్ బ్రూటస్‌ను తన ట్వీట్‌లో ప్రస్తావించారు. ప్రముఖ రోమన్ చక్రవర్తి.. చరిత్రలో ప్రముఖుడు జూలియస్ సీజర్‌ను ఈ బ్రూటసే హతమార్చాడు. జూలియస్ సీజర్ హత్యతో బ్రూటస్ పేరుపొందాడు. అలాగే, రష్యా మిలిటరీలో ఒక సక్సెస్‌ఫుల్ కల్నల్ స్టాఫెన్‌బర్గ్ లేడా? అంటూ అడిగారు. ఇక్కడ కల్నల్ స్టాఫెన్‌బర్గ్ ఎవరో కాదు.. రెండో ప్రపంచానికి యుద్ధానికి కారకుడైనా అడాల్ఫ్ హిట్లర్‌ను బాంబులతో హతమార్చాలని విఫలమైన అప్పటి జర్మన్ మిలిటరీ కల్నల్.
ఈ చరిత్రను ప్రస్తావిస్తూ.. రష్యా మిలిటరీలో ఒక సక్సెస్‌ఫుల్ అంటే.. విజయవంతంగా హతమార్చగలిగే కల్నల్ స్టాఫెన్‌బర్గ్ లేడా? అంటూ అడిగారు. మీరు ఆ పని విజయవంతంగా చేస్తే ప్రపంచానికే గొప్ప సేవ చేసినవారు అవుతారు అంటూ పేర్కొన్నారు.
అమెరికా కాంగ్రెస్‌లో లిండ్సే గ్రాహమ్ 20 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితంగా మెలిగేవారు. లిండ్సే గ్రాహమ్ అమెరికా అధ్యక్ష పోటీలోనూ దిగారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆ దేశ సైన్యం పాల్పడుతున్న యుద్ధ నేరాలు చేస్తున్నారని, మానవాళిపైనే నేరాలకు పూనుకున్నారని పేర్కొంటూ వాటిని ఖండించే తీర్మానాన్ని లిండ్సే గ్రాహమ్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు.
ఉక్రెయిన్‌లో ఇప్పటి వరకు 50 మంది పౌరులు మరణించారు. కాగా, సుమారు పది లక్షల మంది దేశం వదిలి శరణార్థులుగా విదేశాలకు వెళ్లిపోయారు. కానీ, తాము చేసేది యుద్ధం కాదని, కేవలం సైనిక చర్య మాత్రమేనని రష్యా బుకాయిస్తున్నది. వారు ఉక్రెయిన్ పౌరులపైనా దాడికి పాల్పడుతున్న ఘటనలు ఎన్నో కనిపిస్తున్నా.. రష్యా మాత్రం అదే వాదన వినిపిస్తున్నది.