నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. ఆరుగురు దుర్మరణం.. భారత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు..

By Sumanth KanukulaFirst Published Nov 9, 2022, 10:05 AM IST
Highlights

నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ నేపాల్‌లో బుధవారం తెల్లవారుజామున  6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆ దేశాన్ని కుదిపేసింది. ఈ భూకంపం వల్ల ఇళ్లు కూలిపోవడంతో కనీసం 6 మంది మృతిచెందారు. 

నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ నేపాల్‌లో బుధవారం తెల్లవారుజామున  6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆ దేశాన్ని కుదిపేసింది. ఈ భూకంపం వల్ల ఇళ్లు కూలిపోవడంతో కనీసం 6 మంది మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నేపాల్ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. తెల్లవారుజామున 2:12 గంటలకు  భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం దోటి జిల్లాలోని ఖప్తాడ్ నేషనల్ పార్క్‌లో కేంద్రీకృతమై ఉంది.అంతకుముందు.. పశ్చిమ నేపాల్ మంగళవారం రాత్రి 9.07 గంటలకు 5.7 తీవ్రతతో ప్రకంపనల,  రాత్రి 9.56 గంటలకు మరో 4.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. వరుస భూప్రకంపనల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందారు. చాలా మంది ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి..రాత్రి మొత్తం బయటే గడిపారు.

భూకంపం ధాటికి ఆరుగురు మృతి చెందినట్లు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఫణీంద్ర పోఖరెల్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని దోటిలోని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోఖరెల్ చెప్పారు. భూకంపం ధాటికి ఒక పోలీసు పోస్టు, ఎనిమిది ఇళ్లు కూలిపోయాయి. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. 

భూకంపం సమయంలో దెబ్బతిన్న ఇళ్ల శిథిలాల కింద చిక్కుకుని బాధితులందరూ మరణించారని దోటిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో తాత్కాలిక చీఫ్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భోలా భట్టా తెలిపారు. ఇక, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు.

అయితే భూకంపం చోటుచేసుకున్న సమయంలో నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబా కూడా పశ్చిమ నేపాల్‌ ప్రాంతంలోనే ఉన్నారు. భూకంప కేంద్రానికి దక్షిణంగా 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధంగాధి జిల్లాకు ఆయన ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. అయితే ధంగాధిలో కూడా ప్రకంపనలు వచ్చాయని.. అయితే ప్రధానమంత్రి క్షేమంగా ఉన్నారని ఫణీంద్ర పోఖరెల్ తెలిపారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ నేపాల్‌లో ప్రధాని ఎన్నికల ప్రచారానికి సంబంధించి మార్పులు చేయనున్నట్టుగా చెప్పారు. 

ఇక, నేపాల్ ఆర్మీ ప్రతినిధి నారాయణ్ సిల్వాల్ మాట్లాడుతూ.. ముగ్గురు వ్యక్తులు ఆచూకీ తెలియడం లేదని.. పూర్విచౌకిలో ఇళ్లు కూలిపోవడంలో వారు శిథిలాల కింద చిక్కుకున్నారని భావిస్తున్నామని చెప్పారు. తప్పిపోయిన వ్యక్తుల కోసం నేపాల్ ఆర్మీ గాలింపు ప్రారంభించిందని ఆయన తెలిపారు. ఇక, దోటి జిల్లాకు పొరుగున ఉన్న ధంగధి, కైలాలీ జిల్లాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. అలాగే ఖాట్మండు, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో స్వల్పంగా భూప్రకంపలు సంభవించాయి. అర్ధరాత్రి భారతదేశ రాజధాని న్యూఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయని పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. పలువరు నెటిజన్లు కూడా ఢిల్లీలో రాత్రి భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. 

 

click me!