ప్రధానికి ప్రేమతో చెప్పులు చేస్తే.. 50 వేల జరిమానా

By Siva KodatiFirst Published Jun 5, 2019, 2:01 PM IST
Highlights

క్రికెటర్‌గా, రాజకీయవేత్తగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు అభిమానులు ఎక్కువే. ఈ క్రమంలో ఓ వీరాభిమాని ఆయనకు రంజాన్ సందర్భంగా చెప్పులు తయారు చేసి బహుకరించాలనుకున్నాడు. ఆ చర్య అతనిని చిక్కుల్లో పడేసింది. 

క్రికెటర్‌గా, రాజకీయవేత్తగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు అభిమానులు ఎక్కువే. ఈ క్రమంలో ఓ వీరాభిమాని ఆయనకు రంజాన్ సందర్భంగా చెప్పులు తయారు చేసి బహుకరించాలనుకున్నాడు. ఆ చర్య అతనిని చిక్కుల్లో పడేసింది.

వివరాల్లోకి వెళితే.. పెషావర్‌లోని జహంగీర్ పురా బజార్‌ నాణ్యమైన చెప్పులకు కేరాఫ్ అడ్రస్. అక్కడ నూరుద్దీన్ షిన్వారీ అనే వ్యక్తి చెప్పుల దుకాణం నడుపుతున్నాడు. ఇమ్రాన్‌ఖాన్‌ను అమితంగా ఇష్టపడే నూరుద్దీన్ ప్రధానికి రంజాన్ కానుక ఇవ్వాలనుకున్నాడు.

దీనిలో భాగంగా అతను పాము చర్మంతో రెండు జతల చెప్పులను ప్రత్యేకంగా తయారు చేశాడు. ఈ విషయం ఆనోటా ఈ నోటా వన్యప్రాణి సంరక్షణ విభాగానికి అందింది. దీంతో ఆదివారం జిల్లా అటవీశాఖ అధికారి నూరుద్దీన్ దుకాణానికి కస్ట‌మర్‌గా వెళ్లి చెప్పులు కావాలని అడిగాడు.

ఆ సమయంలో ఈ పాము చర్మంతో చేసిన రెండు చెప్పులను నిర్ధారించుకున్నాడు. వెంటనే ఇతర సిబ్బందితో దాడులు నిర్వహించి పాము చర్మంతో చేసిన రెండు జతల చెప్పులను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో భాగంగా నేరాన్ని అంగీకరించిన నూరుద్దీన్.. ఈ పాము చర్మాన్ని ఓ వ్యక్తి తనకు అమెరికా నుంచి పంపించాడని తెలిపాడు. తన కోసం ఒకటి, ఇమ్రాన్ ఖాన్ కోసం ఒక జత తయారు చేశానని తెలిపాడు.

దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు అతనికి రూ. 50 వేల జరిమానా విధించారు. అంతేకాకుండా.. ఇక మీదట జంతువుల చర్మంతో చెప్పులు తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జరిమానా చెల్లించిన అనంతరం చెప్పులను అతనికి తిరిగిచ్చేశారు. ఇంత తతంగం జరిగినప్పటికీ నూరుద్దీన్ మాత్రం ఈ చెప్పులను ఇమ్రాన్ ఖాన్‌కు బహుమతిగా పంపిస్తానని చెప్పడం గమనార్హం.
 

click me!