
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (imran khan)పై అవిశ్వాస తీర్మానం సమీపిస్తున్న వేళ, అధికార పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన దాదాపు 50 మంది మంత్రులు ఒక్కసారిగా కనిపించడం లేదు. వారి జాడ తెలియడం లేదు. ఈ మేరకు పాకిస్థాన్ మీడియా బహిరంగంగా వెల్లడించింది.
50 మందికి పైగా ఫెడరల్, ప్రావిన్షియల్ మంత్రులు పబ్లిక్ స్పేస్‌లో కనిపించడం లేదని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. తప్పిపోయిన మంత్రుల్లో 25 మంది ఫెడరల్, ప్రావిన్షియల్ అడ్వైజర్లు, స్పెషల్ అసిస్టెంట్లు కాగా.. వారిలో నలుగురు రాష్ట్ర మంత్రులు, నలుగురు సలహాదారులు, 19 మంది స్పెషల్ అసిస్టెంట్లు ఉన్నారని ఆ మీడియా సంస్థ తెలిపింది.
ఇమ్రాన్ ఖాన్ కు ఈ పరిస్థితి ఉన్నప్పటికీ సమాఖ్య స్థాయిలో ఇప్పటికీ ఆయన పలువురు మంత్రుల మద్దతును పొందుతున్నారు. పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ, సమాచార మంత్రి ఫవాద్ చౌదరి, ఇంధన మంత్రి హమ్మద్ అజార్, రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్, అంతర్గత మంత్రి షేక్ రషీద్ పాక్ ప్రధానిని సమర్థిస్తున్న మంత్రుల్లో ఉన్నారు. కాగా ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం మార్చి 28కి వాయిదా పడిన తర్వాత పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ తన మిత్రపక్షాలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్-పాకిస్తాన్ (MQM-P) ప్రతినిధి బృందం ఈరోజు పాక్ ప్రధానితో సమావేశమయ్యే అవకాశం ఉందని ARY న్యూస్ తెలిపింది. పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ నిన్న పాలక PTI ముఖ్య మిత్రులైన ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ (MQM) పాకిస్తాన్ ముస్లిం లీగ్-క్వైడ్ (PML-Q) రెండింటినీ సంప్రదించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. షా మహమూద్ ఖురేషీతో పాటు అసద్ ఉమర్, పర్వైజ్ ఖట్టక్ MQM ప్రతినిధి బృందాన్ని కలిశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (క్యూ) నాయకుడు చౌదరి పర్వైజ్ ఇలాహితో ఖురేషీ ఫోన్ లో కూడా మాట్లాడారు. అంతకు ముందు గురువారం నాడు PTI నాయకులు ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ (MQM)ని కూడా కలిశారు. దీని ద్వారా మిత్రపక్షాలు ప్రభుత్వంలోకి తిరిగి వస్తారని, ఓటింగ్ రోజున జాతీయ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధానికి మద్దతు ఇస్తాయని వారిని ఒప్పించారు.
పాకిస్తానీ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యుల బలం ఉంది. మెజారిటీ మార్క్ 172 గా ఉంది. PTI నేతృత్వంలోని సంకీర్ణం 179 మంది సభ్యుల మద్దతుతో ఏర్పడింది. ఇమ్రాన్ ఖాన్ PTI నుంచి 155 మంది సభ్యులు ఉన్నారు. దీంతో పాటు నాలుగు ప్రధాన మిత్రపక్షాలు MQM-P, PML- Q, బలూచిస్తాన్ అవామీ పార్టీ (BAP), గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ (GDA) వరుసగా ఏడు, ఐదు, ఐదు మరియు ముగ్గురు సభ్యులను కలిగి ఉన్నాయి.