
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ నిర్వహించారు. తీవ్ర ఉద్రిక్తతలు, నాటకీయ పరిణామాల మధ్య ఈ ఓటింగ్ పూర్తయ్యింది. దీంతో చివరికి ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ వైదొలగాల్సి వచ్చింది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 174 మంది సభ్యులు ఈ తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు. ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దించేయాలంటే ప్రతిపక్షానికి 172 ఓట్లు అవసరం ఉండగా.. రెండు ఓట్లు ఎక్కువగానే వచ్చాయి. అయితే పాక్ కొత్త ప్రధానిగా ఖాన్ స్థానంలో ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ ఎంపికయ్యే అవకాశం ఉంది.
మార్చి 30వ తేదీన ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపక్షాలన్నీ కలిసి షెహబాజ్ షరీఫ్ ఎంపిక చేసినట్టు చెప్పారు. నేడు (ఆదివారం) ఆయన పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీని కూడా కలవనున్నారు. కాగా సభా నాయకుడిని అధికారికంగా ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి సమావేశం కానుంది.
షెహబాజ్ షరీఫ్ నేపథ్యం ఏమిటి ?
షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (PML-N) అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయన 1950లో లాహోర్‌లోని పారిశ్రామికవేత్త కుటుంబంలో జన్మించాడు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు తమ్ముడు. ఈయన పంజాబ్ ప్రావిన్స్‌కు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
షెహబాజ్ షరీఫ్ ఆగస్టు 2018లో ప్రధానమంత్రి పదవి కోసం ప్రయత్నించాడు. దీని కోసం నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే భుట్టో నేతృత్వంలోని PPP చివరి గంటలో ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్‌ను ఎంపిక చేసింది. ఆయన సులభంగా ఎన్నిక కావడానికి మార్గం సుగమం చేసేందుకు షెహబాజ్ షరీఫ్ ను నామినేషన్ ఉపసంహరించుకోవాని కోరారు.
షరీఫ్ లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాల విశ్వవిద్యాలయంలో తన డిగ్రీ పూర్తి చేశారు. 985లో లాహోర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడయ్యారు. ఆయన 1988లో మొదటిసారి పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1990లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన మళ్లీ 1993లో ప్రావిన్షియల్ ఎన్నికలలో పోటీ చేసి పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. 1997లో తొలిసారిగా పంజాబ్ ప్రావిన్స్ సీఎం అయ్యారు. 1999లో అప్పటి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ పర్వే ముషారఫ్ సైనిక తిరుగుబాటు తర్వాత, షెహబాజ్ షరీఫ్ ఖైదు చేయబడ్డాడు. తరువాత ఆయనను సౌదీ అరేబియాకు బహిష్కరించారు.
PML-N చీఫ్ షరీఫ్ 2007లో పాకిస్థాన్ కు తిరిగి వచ్చారు. మరుసటి సంవత్సరంలో ఆయన మూడో సారి పంజాబ్ ప్రావిన్స్‌కి ముఖ్యమంత్రి అయ్యాడు. 2017లో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పనామా పేపర్లకు సంబంధించిన కేసులో ఆయన సోదరుడు దోషిగా తేలడంతో ఫిబ్రవరి 2018లో షరీఫ్ PML-N అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నందున షెహబాజ్ షరీఫ్‌ను సెప్టెంబర్ 2020లో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) అరెస్టు చేసింది. అయితే ఆయనకు పాకిస్థాన్ సైన్యంతో మంచి సంబంధాలు ఉన్నాయి.