
జర్మనీలోని హాంబర్గ్ నగరంలో ముష్కరులు విచక్షణారహితంగా కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అల్స్టర్‌డార్ఫ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని హాంబర్గ్ పోలీసులు తెలిపారు. జర్మనీ మీడియా నివేదిక ప్రకారం.. ఉత్తర జర్మనీలోని హాంబర్గ్ నగరంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు ఏడుగురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాంబర్గ్ నగరంలోని ఓ చర్చిలో ఈ దాడి జరిగింది. రాత్రి 9 గంటలకు కాల్పులు జరిగాయని, ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది దుండగులు దాడిలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. గ్రాస్‌బోర్‌స్టెల్ జిల్లాలోని డీల్‌బోజ్ వీధిలోని చర్చిలో కాల్పులు జరిగాయి. చాలా మంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు, మరికొందరు ప్రాణాపాయం కూడా కలిగి ఉన్నారు" అని పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు. విపత్తు హెచ్చరిక యాప్‌ని ఉపయోగించి ప్రాంతంలో "తీవ్ర ప్రమాదం" గురించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఏ ఉద్దేశ్యంతో ఈ దాడులు చేశారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ కాల్పుల్లో ఏడుగురు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారని బిల్డ్ వార్తాపత్రికను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. యెహోవాసాక్షి చర్చిలో ఈ కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనకు పాల్పడిన నేరస్తులు పరారీలో ఉన్నారని జర్మన్ మీడియా తెలిపింది. హాంబర్గ్ పోలీసులు ట్విటర్‌లో ఈ సంఘటనను ధృవీకరించారు, కాల్పులు జరిగిన ఆల్స్టర్‌డార్ఫ్ జిల్లాలో భారీ పోలీసు ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇంతకుమించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అత్యవసర సేవలు, వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ఆపరేషన్ మధ్య సమీపంలో నివసిస్తున్న నివాసితులు తమ ఇళ్లను విడిచిపెట్టవద్దని హెచ్చరించారు.