ఫ్లోరిడాలో కుప్పకూలిన 12 అంతస్తుల బిల్డింగ్... ఇంకా దొరకని 99 మంది ఆచూకీ..

By AN TeluguFirst Published Jun 25, 2021, 10:57 AM IST
Highlights

ఫ్లోరిడాలోని ఉత్తర మయామిలో దారుణం జరిగింది. 12 అంతస్తుల నివాస భవనం కూలిపోవడంతో ఒకరు మరణించగా, పదుల సంఖ్యలో ప్రజలు తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఫ్లోరిడాలోని ఉత్తర మయామిలో దారుణం జరిగింది. 12 అంతస్తుల నివాస భవనం కూలిపోవడంతో ఒకరు మరణించగా, పదుల సంఖ్యలో ప్రజలు తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు.

మయామి-డేడ్ మేయర్ డేనియల్ లెవిన్-కావా చెబుతున్న దాని ప్రకారం, ఆ సమయంలో అక్కడ ఉన్న వారి సంఖ్య 102 కాగా, ఇంకా 99 మంది లెక్క తేలలేదని అంటున్నారు. అయితే, ఆ సమయంలో భవనంలో ఎంత మంది ఉన్నారో స్పష్టంగా తెలియదు.

ఈ ఘటనలో 130 ప్లాట్లు ఉన్న ఈ  కాంప్లెక్స్‌లో సగం కూలిపోయాయి. దీనికి కారణం ఇది చాలా పాత బిల్డింగ్ కావడమే అంటున్నారు. సర్ఫ్‌సైడ్ పట్టణంలోని ఈ బ్లాక్‌ను 1980 లో నిర్మించారు.

ఇందులో నివసిస్తున్న అనేకమంది లాటిన్ అమెరికన్ వలసదారులు తప్పిపోయినట్లు ఆ దేశ కాన్సులేట్ చెబుతోంది. కనిపించకుండా పోయిన వారిలో పరాగ్వే మొదటి మహిళ బంధువులు కూడా ఉన్నారని పరాగ్వేయన్ అధికారులు తెలిపారు. వీరిలో ప్రథమ మహిళ సిల్వానా లోపెజ్ మొరెరా సోదరి, బావమరిది, వారి ముగ్గురు పిల్లలు, డొమెస్టిక్ వర్కర్ ఉన్నారు.  

కాగా, శిధిలాల నుండి 35 మందిని రెస్క్యూ టీం కాపాడిందని అధికారులు తెలిపారు. వీరిలో పది మందికి కావల్సిన ప్రాథమిక చికిత్స అందించి పంపించారు. ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రాణాలతో ఉన్నవారిని కాపాడడం కోసం శిధిలాల క్రింద ఉన్న పార్కింగ్ గ్యారేజ్ నుంచి పనులు మొదలుపెట్టారు.  

రెస్క్యూ సమయంలో మంటలు చెలరేగాయని.. అయితే వాటిని 20 నిమిషాల్లోనే ఆర్పి వేశామని మయామి-డేడ్ ఫైర్ చీఫ్ రైడ్ జదల్లా చెప్పారు. శిధిలాల కింద చిక్కుకున్న వారికోసం సోనార్ ,సెర్చ్ కెమెరాలతో పాటు..ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలను ఉపయోగిస్తున్నారని, అయితే వీటివల్ల శిథిలాలు మరింతగా కూలే అయితే ప్రమాదం ఉన్నందున.. సహాయకార్యక్రమాలు నెమ్మదిగా జరుగుతున్నాయని తెలిపారు. 

"భవనం వెనుక భాగం, పూర్తిగా కూలిపోయిందని సర్ఫ్ సైడ్ మేయర్ చార్లెస్ బుర్కెట్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం సంఘటనా స్థలాన్ని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ సందర్శించారు. బాధితులకు సాయం కోసం ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ ఇంకా "సెర్చ్ అండ్ రెస్క్యూ మోడ్" లోనే ఉందని చెప్పారు. అలాంటి భారీ నిర్మాణం కూలిపోవడాన్ని చూడటం నిజంగా బాధాకరమైనది" అని ఆయన అన్నారు.

ఈ ఘటన మీద అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. ఇది చాలా విషాదకర ఘటన అన్నారు. డిసాంటిస్ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నానన్నారు.  ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఫెమా) అధికారులు విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలంలో ఉన్నారని  చెప్పారు.

"నేను ఫ్లోరిడా ప్రజలకు ఏ సాయం కావాలన్నా.. ఫెడరల్ ప్రభుత్వం ఏమి ఇవ్వగలదు పూర్తిగా చేస్తాం. మీకేం కావాలో అడగండి. మీ కోసం మేమున్నాం’’ అని  బిడెన్ చెప్పారు.

ఈ బిల్డింగ్ కొలాప్స్ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న  అపార్టుమెంటులలో నివసించేవారిని తరలించడానికి రెస్క్యూ టీం పనిచేస్తుంది. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు ఒకరు మాట్లాడుతూ.. ‘నేను కుక్కను తీసుకుని వాకింగ్ కి వచ్చాను.. అప్పుడు పెద్ద శబ్దం వినిపించింది. భూకంపం వచ్చిందా అనిపించింది. ఆ తరువాత ఓ ధూళి మేఘం రావడం కనిపించింది’’ అని చెప్పారు.

మాకర్థం కాలేదు. షాక్ అయ్యాం. శబ్దం వచ్చినవైపు పరుగులు పెట్టాం.. ఇంతలో సెక్యూరిటీ గార్డ్ వస్తూ కనిపించాడు. ఏం జరిగింది? అని అడిగితే భవనం కూలిపోయిందని అతను చెప్పాడు" అని మరొకరు తెలపగా.. ఇది 9/11 దాడుల్ని గుర్తు చేసిందని మరొక ప్రత్యక్ష సాక్షి అన్నారు. 

click me!