మంచు పొరల్లో నుంచి 48,500 ఏళ్ల నాటి జోంబీ వైరస్ పునరుద్దరణ.. మానవాళికి మరో ముప్పు?

By Sumanth KanukulaFirst Published Nov 30, 2022, 4:10 PM IST
Highlights

కరోనా వైరస్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భవిష్యత్‌లో కొత్త కొత్త వైరస్‌ల రూపంలో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఇందుకు గ్లోబల్ వార్మింగ్ కూడా ప్రధాన కారణమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కరోనా వైరస్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భవిష్యత్‌లో కొత్త కొత్త వైరస్‌ల రూపంలో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఇందుకు గ్లోబల్ వార్మింగ్ కూడా ప్రధాన కారణమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఘనీభవించిన మంచులో  48,500 ఏళ్ల నాటి జోంబీ వైరస్ శాస్త్రవేత్తలు పునరుద్ధరించారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో శాశ్వత మంచు నుంచి సేకరించిన పురాతన నమూనాలను పరిశోధకులు పరిశీలించారు. ‘‘జోంబీ వైరస్‌లు’’ అని పిలిచే 13 కొత్త వ్యాధికారకాలను పునరుద్ధరించారు. వాటి వర్గీకరణ కూడా చేశారు. అనేక సహస్రాబ్దాలు గడ్డకట్టిన నేలలో చిక్కుకున్నప్పటికీ అవి అంటువ్యాధిగా ఉన్నాయని కనుగొన్నారు. 

అందులో పురాతన వైరస్‌ను పండోరవైరస్ యెడోమా అని పిలుస్తున్నారు. ఇది 48,500 సంవత్సరాల నాటిదని తెలిసిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఇది 2013లో అదే బృందం కనిపెట్టిన 30,000 సంవత్సరాల పురాతన వైరస్ కలిగి ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. వాతావరణ మార్పుల కారణంగా పురాతన శాశ్వత మంచు కరిగిపోవడం మానవులకు కొత్త ముప్పును కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. 

రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌లకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో భాగస్వాములుగా ఉన్నారు. వారు అధ్యయనం చేసిన వైరస్‌లకు పునరుజ్జీవనం జీవసంబంధమైన ప్రమాదం ‘‘పూర్తిగా అతితక్కువ’’ అని చెప్పారు. అత్యంత ఘనీభవించిన మంచు కరిగిపోయి.. జంతువులు, మానవులకు సోకే వైరస్‌లు భూవాతావరణంలోకి విడుదలైతే పెను సమస్యగా పరిణమిస్తాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని నిజమైన ముప్పుగా చూడాలని చెప్పారు. ఇది ఎప్పుడైనా పెద్ద సమస్యగా మారుతుందని హెచ్చరించారు.

‘‘పురాతన శాశ్వత మంచు కరిగేటప్పుడు ఈ తెలియని వైరస్‌లను విడుదల చేసే అవకాశం ఉంది’’ అని వారు ప్రీప్రింట్ రిపోజిటరీ బయోఆర్‌క్సివ్‌కి పోస్ట్ చేసిన ఒక కథనంలో రాశారు. అయితే అది ఇంకా పీర్-రివ్యూ చేయబడలేదు. ‘‘ఒకసారి బహిరంగ పరిస్థితులకు గురైనప్పుడు ఈ వైరస్‌లు ఎంతకాలం అంటువ్యాధిగా ఉండగలవు, వాటిని ఎదుర్కొనే అవకాశాలు,  అవి సోకే అవకాశం ఎంతవరకు ఉంటుందో అంచనా వేయడం ఇంకా అసాధ్యం’’ అని పేర్కొన్నారు. 

వాతావరణం వేడెక్కడం వల్ల శాశ్వత మంచు కరగడం వల్ల దాని కింద ఉన్న మీథేన్ వంటి గ్రీన్హౌస్ వాయువుల విడుదల వాతావరణ మార్పులను మరింత దిగజార్చుతుందని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ నిద్రాణమైన సూక్ష్మజీవులపై దాని ప్రభావం పూర్తి స్థాయిలో అంచనా వేయలేదు. 

click me!