ఒంటిపై దుస్తులను తొలగించి.. హిజాబ్ వ్యతిరేక నిరసనలకు నటి మద్దతు.. నగ్నత్వాన్ని ప్రోత్సహించడం లేదని కామెంట్

By Sumanth KanukulaFirst Published Oct 12, 2022, 10:37 AM IST
Highlights

ఇరాన్‌లో మహిళలు హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నెట్‌ఫ్లిక్స్ సిరీస్ సేక్రేడ్ గేమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చకున్న నటి ఎల్నాజ్ నొరౌజీ కూడా.. ఇరాన్ మొరాలిటీ పోలీసులకు వ్యతిరేకంగా మహిళల భారీ నిరసనకు మద్దతు పలికారు.

ఇరాన్‌లో మహిళలు హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలు చేస్తున్న నిరసనలకు పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ సిరీస్ సేక్రేడ్ గేమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చకున్న నటి ఎల్నాజ్ నొరౌజీ కూడా.. ఇరాన్ మొరాలిటీ పోలీసులకు వ్యతిరేకంగా మహిళల భారీ నిరసనకు మద్దతు పలికారు. ఇరాన్‌లోనే జన్మించిన ఎల్నాజ్ నొరౌజీ.. మహిళలు తమకు కావలసినది ధరించే హక్కు ఉందని నొక్కిచెప్పారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. 

అందులో ఆమె తన ఒంటిపై పొరలుగా ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా విప్పుతూ కనిపించారు. అయితే తాను నగ్నత్వాన్ని ప్రోత్సహించడం లేదని.. ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ప్రచారం చేస్తున్నాని స్పష్టం చేశారు. ‘‘ప్రతి మహిళ..ప్రపంచంలో ఎక్కడైనా, ఆమె ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ.. ఆమె కోరుకున్నది ధరించే హక్కును కలిగి ఉండాలి. ఏ పురుషుడికి గానీ.. మరే ఇతర మహిళకు గానీ ఆమెకు తీర్పు చెప్పే హక్కు లేదా ఆమెను వేరే విధంగా దుస్తులు ధరించమని అడిగే హక్కు లేదు. ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు, నమ్మకాలు ఉన్నాయి. వారిని గౌరవించాలి. ప్రజాస్వామ్యం అంటే నిర్ణయించే అధికారం.. ప్రతి మహిళకు తన శరీరంపై నిర్ణయం తీసుకునే అధికారం ఉండాలి. నేను నగ్నత్వాన్ని ప్రోత్సహించడం లేదు. నేను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ప్రోత్సహిస్తున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు. 

ఇక, ఎల్నాజ్ నొరౌజీ.. యాక్టింగ్ కేరీర్‌లోకి ప్రవేశించడానికి ముందు.. డియోర్, లాకోస్ట్, లే కోక్ స్పోర్టివ్ వంటి పలు బ్రాండ్లకు అంతర్జాతీయ మోడల్‌గా 10 సంవత్సరాలకు పైగా పనిచేశారు. ఆమె పర్షియన్ సంప్రదాయ నృత్యంలో శిక్షణ పొందారు. భారతదేశంలో ఆమె కథక్ నృత్యం నేర్చుకుంటున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Elnaaz Norouzi (@iamelnaaz)


ఇరాన్‌లో కొనసాగుతున్న మహిళల నిరసన.. 
ఇరాన్‌లో షరియా చట్టం ప్రకారం ఏడేళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ పాటించాలి. మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. తల, జుట్టు కనిపించకూడదు. శరీరం కనబడకుండా పొడవైన, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఈ నియమాన్ని మరింత కఠినతరం చేస్తూ కొన్ని నెలల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొరాలిటీ పోలీసులు.. మరింత కఠినంగా వ్యవహరించడం ప్రారంభించారు. హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో సెప్టెంబర్ 16న మహ్సా అమిని అనే 22 ఏళ్ల మహిళను మొరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మూడు రోజుల తర్వాత ఆమె చనిపోయినట్టుగా ప్రకటించారు. 

అయితే మహ్సా అమిని మృతికి నిరసనగా ఇరాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. చట్టాల పేరుతో  ఏళ్ల తరబడి ఎదుర్కొంటోన్న అణచివేతను వ్యతిరేకిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. జుట్టును కత్తిరించుకుంటూ, హిజాబ్‌లను కాల్చేస్తూ మహిళలు నిరసన తెలియజేస్తున్నారు.
 

click me!