
ఉక్రెయిన్‌పై యుద్దం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. యూఎస్ నేతృత్వంలోని నాటో కూటమి రష్యాను ఓడించగలమనే తప్పుడు నమ్మకంతో సంఘర్షణ జ్వాలలను రగిలిస్తోందని ఆరోపించారు. పుతిన్ మంగళవారం రోజున స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో.. యుద్ధాన్ని నివారించడానికి రష్యా చేయగలిగినదంతా చేసిందని అన్నారు. అయితే పాశ్చాత్య దేశాల మద్దతు ఉన్న ఉక్రెయిన్ క్రిమియాపై దాడి చేయడానికి ప్లాన్ చేస్తోందని పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టింది ప్రత్యేక సైనిక ఆపరేషన్ అని అన్నారు. అదే సమయంలో పాశ్చాత్య దేశాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రష్యా సరిహద్దుల వరకు విస్తరించాలని నాటో భావించిందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితికి పాశ్చాత్య దేశాలదే బాధ్యత అని మండిపడ్డారు. శాంతియుతంగా సమస్య పరిష్కారానికి చర్యలు ఉంటాయని అన్నారు. అయితే సమస్య పరిష్కారానికి పాశ్చాత్య దేశాలు సిద్దంగా లేవని విమర్శించారు. వారి వైఖరితోనే సమస్య మరింత జఠిలం అవుతోందని మండిపడ్డారు. పాశ్చాత్య దేశాలు యుగోస్లేవియా, ఇరాక్, లిబియా, సిరియాలను నాశనం చేస్తూ సిగ్గు లేకుండా ద్వంద్వంగా ప్రవర్తించారని విమర్శించారు. ఈ అవమానాన్ని వారు ఎప్పటికీ తుడిచివేసుకోలేరని అన్నారు. గౌరవ భావనలు , విశ్వాసం, మర్యాద అనేవి వారికి పరాయి అంటూ సెటైర్లు వేశారు.
పాశ్చాత్య దేశాలు స్థానిక సంఘర్షణను ప్రపంచ సంఘర్షణగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. తాము తగిన విధంగా ప్రతిస్పందిస్తామని చెప్పారు. తాము తమ దేశం యొక్క ఉనికి గురించి మాట్లాడుతున్నామని పుతిన్ పేర్కొన్నారు. ‘‘ఉక్రెయిన్ ప్రజలు వారికి వారే కైవ్ పాలన, దాని పాశ్చాత్య యజమానులకు బందీలుగా మారారు. పాశ్చాత్య దేశాలు వాస్తవానికి ఆ దేశాన్ని రాజకీయ, సైనిక, ఆర్థిక కోణంలో ఆక్రమించారు’’ అని పుతిన్ అన్నారు.
ఉక్రెయిన్‌లో రష్యా తన ప్రయత్నాలను విడిచిపెట్టదని పుతిన్ స్పష్టం చేశారు. ‘‘అంచెలంచెలుగా, మేము మా అన్ని పనులను జాగ్రత్తగా, స్థిరంగా పూర్తి చేస్తాము’’ అని పుతిన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కైవ్‌లో అత్యంత రహస్యంగా పర్యటించిన ఒక రోజు తర్వాత పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.