ఖార్కివ్ యుద్ధంలో ర‌ష్యా మేజ‌ర్ జ‌న‌ర‌ల్ విటాలీ గెరాసిమోవ్ మృతి.. ప్ర‌క‌టించిన ఉక్రెయిన్

Published : Mar 08, 2022, 11:32 AM IST
ఖార్కివ్ యుద్ధంలో ర‌ష్యా మేజ‌ర్ జ‌న‌ర‌ల్ విటాలీ గెరాసిమోవ్ మృతి.. ప్ర‌క‌టించిన ఉక్రెయిన్

సారాంశం

పుతిన్ సేనలకు, జెలెన్ స్కీ దళాలకు మధ్య జరిగిన భీకర దాడిలో రష్యాకు చెందిన ముఖ్య సైనిక అధికారి చనిపోయారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. సోమవారం ఖార్కివ్ యుద్ధంలో మేజ‌ర్ జ‌న‌ర‌ల్ విటాలీ గెరాసిమోవ్ మృతి చెందారని తెలిపింది.  

ఉక్రెయిన్ (Ukraine)కు, ర‌ష్యా (Russia)కు మ‌ధ్య యుద్దం కొన‌సాగుతూనే ఉంది. ఉక్రెయిన్ ప్ర‌ధాన న‌గ‌రాల్లో బాంబుల వ‌ర్షం కురుస్తోంది. ఎటు చూసినా విధ్వంస‌మే క‌నిపిస్తోంది. ధ్వంస‌మైన భ‌వ‌నాలు, దెబ్బ‌తిన్న రోడ్లు, వంతెన‌లు ఇప్పుడు ఉక్రెయిన్ న‌గ‌రాల్లో క‌నిపించే దృశ్యాలు. ఈ యుద్ధం వ‌ల్ల రెండు దేశాలు చాలా న‌ష్ట‌పోతున్నాయి. అమాయ‌కులైన పౌరులు చ‌నిపోతున్నారు. యుద్ధం ఆపేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లితాల‌ను ఇవ్వ‌డం లేదు. సోమ‌వారం ఉక్రెయిన్, ర‌ష్యాకు మధ్య మూడో ద‌శ చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ ఇవి కూడా విఫ‌ల‌మ‌య్యాయి. అయితే ఉక్రెయిన్ లో చిక్కుకున్న పౌరుల‌ను త‌లించేందుకు వీలుగా ర‌ష్యా త‌న దాడికి కొంత విరామం ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇది మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని తెలిపింది. 

ఇదిలా ఉండ‌గా సోమ‌వారం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నంత సేపు కూడా ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి  చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ లో ముఖ్యమైన సిటీల్లో బాంబుల మోత మోగింది. ర‌ష్యా సైన్యానికి ఉక్రెయిన్ బ‌ల‌గాలు ధీటుగా బ‌దులిచ్చాయి. అయితే ఖార్కివ్ (Kharkiv)లో జ‌రిగిన ఎదురుదాడిలో రష్యన్ జనరల్ విటాలి గెరాసిమోవ్ (Russian Major General Vitaly Gerasimov) మరణించారు. ఈ విష‌యాన్ని ఉక్రెనియ‌న్ ర‌క్ష‌ణ శాఖ నివేదించింది. ‘‘ ఆక్రమిత సైన్యం సీనియర్ కమాండ్ సిబ్బందికి మరొక నష్టం ’’ అని పేర్కొంది. 

ఈ ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ రష్యాలోని సెంట్రల్ మిలిటరీ డిస్ట్రిక్ట్ 41వ సైన్యానికి మొదటి డిప్యూటీ కమాండర్. ఆయ‌న విటాలీ గెరాసిమోవ్ రెండవ చెచెన్ యుద్ధం, సిరియాలో జరిగిన రష్యన్ సైనిక కార్యకలాపాలలో కీల‌క పాత్ర పోషించారు. దీని కోసం ఆయ‌న ప‌త‌కాల‌ను కూడా గెలుచుకున్నారు.  ఒక వారంలో ర‌ష్య‌న్ సైన్యం కొల్పోయిన రెండో జ‌న‌రల్ గా గైరాసిమోవ్ నిలిచారు. మార్చి నెల ప్రారంభంలో ర‌ష్యా ఆర్మీ డిప్యూటీ కమాండర్, మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్స్కీ మృతి చెందారు. ఈ విష‌యాన్ని రష్యా మీడియా ధృవీకరించింది. 

లాజిస్టికల్ సమస్యలు, పేలవమైన నైతికత, ఉక్రేనియన్ ప్రతిఘటన కారణంగా పుతిన్ దళం చిక్కుకుపోయిన స‌మ‌యంలో ఈ ఇద్ద‌రు ముఖ్య అధికారులు చ‌నిపోయారు. ఈ విష‌యంలో మంగళవారం ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యాకు యుద్ధం పీడ కల లాంటిది అని అన్నారు. ఉక్రేనియ‌న్ సైన్యం చేసిన ప్ర‌తిఘ‌ట‌న‌ను ప్ర‌శంసించారు. కాగా.. ఉక్రెయిన్‌ పై రష్యా సైనిక చ‌ర్య ప్రకటించి నేటికి 13 రోజులు అవుతోంది. రష్యా దాడులతో ఉక్రెయిన్ విలవిలలాడుతోంది. ఇప్ప‌టికే ప‌లు న‌గరాలను ధ్వంసం చేసిన ర‌ష్యా సైన్యాలు  ఉక్రెయిన్‌  రాజధాని కీవ్‌ను హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని ర‌ష్యా తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నాయి. అయితే, ఉక్రేనియన్  బ‌లగాలు కూడా  చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి 

ఈ రెండు దేశాల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంలో వివిధ ఉక్రెయిన్ లో చ‌దువు కోసం, జీవ‌నోపాధి కోసం వ‌చ్చిన చాలా మంది విదేశీయులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్రాణాల‌ను అర చేతిలో పెట్టుకొని బ‌తుకుతున్నారు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌క కాలం వెళ్ల‌దీస్తున్నారు. త‌మ దేశాల పౌరుల‌ను తీసుకొచ్చేందుకు ఆయా దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్త‌న్నాయి, అందులో భాగంగానే మ‌న దేశం కూడా ఆప‌రేష‌న్ గంగా పేరిట ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే