ఉక్రెయిన్‌లోకి ప్రవేశించిన రష్యా సేనలు.. ఆ ప్రాంతాలతో మిలిటరీ ఒప్పందాలు

Published : Feb 22, 2022, 12:58 PM ISTUpdated : Feb 24, 2022, 09:48 AM IST
ఉక్రెయిన్‌లోకి ప్రవేశించిన రష్యా సేనలు.. ఆ ప్రాంతాలతో మిలిటరీ ఒప్పందాలు

సారాంశం

ఉక్రెయిన్‌లోకి రష్యా సేనలు ప్రవేశించాయి. తూర్పు ఉక్రెయిన్‌కు చెందిన దొంబాస్ రీజియన్‌లోని రెండు ప్రాంతాలు వేర్పాటువాదుల అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటిని రష్యా ప్రభుత్వం స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించింది. ఆ వెంటనే అక్కడికి తమ సైన్యాన్ని పంపించే ఆదేశాలు వెలువరించింది. ఆ రెండు ప్రాంతాల్లో మిలిటరీ బేస్‌లు నిర్మించే ఒప్పందాలనూ చేసుకుంది.  

న్యూఢిల్లీ: అందరూ భయపడుతున్నట్టే రష్యా(Russia) ప్రభుత్వం తమ సేనలను(Military) ఉక్రెయిన్‌(Ukraine)లోకి పంపింది. మిలిటరీని ఉక్రెయిన్‌లోకి మార్చ్ చేయాల్సిందిగా నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఆదేశించారు. వాటి అనుసారం మిలిటరీ వాహనాలు రష్యా నుంచి తూర్పు ఉక్రెయిన్ ప్రాంతానికి వెళ్లాయి. ఈ మార్చ్‌కు ముందే రష్యా కీలక ప్రకటన చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల వేర్పాటువాదుల ప్రాబల్యం ఉన్న రెండు ప్రాంతాలను స్వతంత్రమైనవిగా(Independent) గుర్తించింది. ఆ తర్వాత ఆ ప్రాంతాలకు రష్యా మిలిటరీ వెళ్లింది. అంతేకాదు, మెరుపు వేగంతో ఆ రెండు ప్రాంతాలతో మిలిటరీ ఒప్పందం కుదుర్చుకుంది.

ఉక్రెయిన్ తూర్పు భాగంలో దొంబాస్ రీజియన్ ఉన్నది. ఈ రీజియన్‌లోని డొనెత్స్క్, లుహన్స్క్‌లలో వేర్పాటువాదులు ఉన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో రష్యా మద్దతు ఉన్న(!) వేర్పాటువాదులతో నిండి ఉన్నది. ఇక్కడ ఉక్రెయిన్ ప్రభుత్వ పాలన సాగడం లేదు. అయితే, ఈ రెండు ప్రాంతాలను రష్యా ప్రభుత్వం నిన్న స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించింది. వాటిని దొనెత్స్క్ పీపుల్స్ రిపబ్లిక్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లుగా గుర్తించింది. ఈ రెండు ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా రష్యా గుర్తించిన తర్వాత అక్కడకు తమ మిలిటరీని పంపింది. శాంతి భద్రతలను కాపాడటానికి తాము ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని రష్యా పేర్కొంది. అంతేకాదు, ఈ రెండు స్వతంత్ర ప్రాంతాల్లో తమ మిలిటరీ బేస్ నిర్మించడానికి రష్యా ఒప్పందం చేసుకుంది. ఆ ప్రాంతాలూ రష్యాలో ఆ పని చేసుకోవచ్చు.

రష్యా చర్యలపై పశ్చిమ దేశాలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కాయి. పశ్చిమ దేశాలు, యూఎస్.. ఆ స్వతంత్ర ప్రాంతాలపై ఆంక్షలు విధించడానికి సిద్ధం అయ్యాయి. యూకే అయితే.. రష్యాపై మరిన్ని అదనపు ఆంక్షలను విధించనుంది. కాగా, రష్యా.. ఉక్రెయిన్‌ను దురాక్రమించడానికి అడ్డుకోవడానికి తాము దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటామని అమెరికా తెలిపింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే యునైటెడ్ నేషన్స్.. భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో భారత్ కూడా పాల్గొని ఉక్రెయిన్‌లోని భారత పౌరుల భద్రతపై ఆందోళన వెలిబుచ్చింది. కాగా, రష్యా, ఉక్రెయిన్ దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. రష్యా చర్యలను పేర్కొంటూ క్రెమ్లిన్ నుంచి ఈ వైరస్ వ్యాపిస్తున్నదని ఉక్రెయిన్ మండిపడింది. కాగా, దొంబాస్ రీజియన్‌లోని ప్రజలను తప్పకుండా కాపాడాల్సిన అవసరం ఉన్నదని రష్యా పేర్కొంది. అమెరికా, దాని మిత్ర దేశాలతో చర్చించి రష్యాపై ఆర్థిక ఆంక్షలు మరింత కఠినం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది.

కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమైర్ జెలెన్‌స్కీ మాట్లాడతూ.. తమ దేశం ఎవరికీ భయపడదని స్పష్టం చేశారు. తాము తమ సొంత భూమిపై ఉన్నామని, తాము ఎవరికీ, దేనికీ భయపడేది లేదని పేర్కొన్నారు. రష్యా తమ మిలిటరీని ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాలని ప్రకటించిన తర్వాత ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.

వేర్పాటువాదుల ప్రాంతం నుంచి తమ బలగాలపై షెల్లింగ్ దాడులు జరుగుతున్నాయిన ఉక్రెయిన్ ఇది వరకే వెల్లడించింది. ఈ షెల్లింగ్ దాడుల్లో ఇద్దరు జవాన్లు మరణించారని ఫిబ్రవరి 20వ తేదీన ప్రకటించింది. గత కొన్ని రోజుల్లో రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో సుమారు రెండు వేల సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !