
న్యూఢిల్లీ: రష్యా మరోసారి న్యూక్లియర్ వార్నింగ్ ఇచ్చింది. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు అమెరికా సారథ్యలోని నాటో కూటమిలో చేరితే ఈ రీజియన్‌లో అణ్వాయుధాలతో మోహరిస్తామని హెచ్చరించింది. ఆ రెండు దేశాలు నాటో కూటమిలో చేరితే ఇక బాల్టిక్ రీజియన్ న్యూక్లియర్ రహితంగా ఉండాలనే ఆశలను వదులుకోవాలని నాటోను ఉద్దేశించి పేర్కొంది. ఎందుకంటే.. బ్యాలెన్స్ కచ్చితంగా మెయింటెయిన్ చేసి తీరాల్సిందేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్
దిమిత్రి మెద్వెదెవ్ అన్నారు. ఈ విషయాలపై చర్చలు, సంప్రదింపులు అనే మార్గాలు ఉండబోవని స్పష్టం చేశారు. బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తామని వివరించారు.
ఈ రెండు దేశాలు నాటో చేరితో సహజంగానే, ఈ సరిహద్దులపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ రోజు వరకు ఇలాంటి చర్య లు తీసుకోలేదని, భవిష్యత్‌లోనూ తీసుకోబోమని తెలిపారు. ‘కానీ, అటువైపుగా ఒత్తిడి పెడితే మాత్రం.. దీనిపై మీరే అర్థం చేసుకోవాలని, ఈ ప్రతిపాదన తెచ్చింది మేమైతే కాదు’ అని వివరించారు. ఫిన్లాండ్ దేశంపై తమ గ్రౌండ్ ఫోర్స్, నావికా దళం, వైమానిక దళాలను మోహరిస్తామని పేర్కొన్నారు. ఫిన్లాండ్ 1300 కిలోమీటర్ల సరిహద్దును రష్యాతో పంచుకుంటున్నది. స్వీడన్
నేరుగా రష్యాతో సరిహద్దు పంచుకోదు. కానీ, ఫిన్లాండ్ పక్కనే ఉన్న దేశం.
ఈ రెండు దేశాలు ఇటీవలే నాటో కూటమిలో చేరడంపై ఆలోచనలు చేస్తున్నట్టు ప్రకటించిన తరుణంలో రష్యా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు పశ్చిమ దేశాలతో ఎక్కువగా కలిసి మెలిసి ఉంటాయి. కానీ, ఎప్పుడూ నాటోలో చేరాలనే ప్రయత్నాలు చేయలేదు. తద్వార రష్యాను రెచ్చగొట్టాలని భావించలేదు. కానీ, ఉక్రెయిన్‌పై రష్యా ‘మిలిటరీ చర్య’ను ప్రకటించిన పిదప దాని చర్యలను గమనిస్తున్న తరుణంలో ఈ ఆలోచనలు చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
స్వీడన్, ఫిన్లాండ్ దేశ ప్రధానులు నిన్న సమావేశం అయ్యారు. నాటో మిలిటరీ కూటమిలో చేరడంపై చర్చలు జరిపారు. మరికొన్ని వారాల్లో నాటో చేరడానికి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేస్తామని ఆ దేశ ప్రధానులు వెల్లడించారు. జూన్‌లోపు నాటోలో చేరడానికి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేస్తామని స్వీడన్ ప్రధాని మాగ్దలీనా అండర్సన్ తెలిపారు. కాగా, మరికొన్ని వారాల్లో తాము కూడా ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేస్తామని ఫిన్లాండ్ ప్రధానమంత్రి శాన మేరిన్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా(Russia) యుద్ధం చేయడానికి నాటో(NATO Alliance) ప్రధాన కారణంగా ఉన్నది. ఉక్రెయిన్‌ను నాటో సైనిక కూటమిలో చేర్చుకోవద్దని రష్యా వారిస్తున్నది. ఉక్రెయిన్‌ను వారించినా వినలేదు. ఆ దేశాన్ని చేర్చుకోవద్దని నాటో కూటమి దేశాలను డిమాండ్ చేసినా వినలేవు. ఈ పరిణామాల తర్వాత రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగింది. ఈ క్రమంలోనే నాటో గురించి విస్తృత చర్చ జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నాటో కేంద్రంగా చూస్తున్నారు.
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా గతంలో భయానక హెచ్చరికలు చేసింది. తమకు ప్రత్యేక డొమెస్టిక్ సెక్యూరిటీ కాన్సెప్ట్ ఉన్నదని, ఇక్కడి ప్రజల కోసం ప్రత్యేక కాన్సెప్ట్ ఉన్నదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అందులోనే తాము న్యూక్లియర్ వెపన్స్ వినియోగానికి అవసరమైన సందర్భాలను వివరించామని పేర్కొన్నారు. తమ దేశం ఉనికికే ముప్పు వస్తే తమ కాన్సెప్ట్ ప్రకారం అణ్వాయుధాలు వినియోగిస్తామని తెలిపారు.