
Russia Ukraine War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వ్యాన్స్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని విమర్శించకుండా సంయమనం పాటించారని రష్యా విదేశాంగ శాఖకు చెందిన మరియా జఖరోవా అన్నారు. విదేశాలకు జెలెన్ స్కీ అబద్ధాలు చెబుతున్నారని జఖరోవా ఆరోపించారు. 2022లో ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఎటువంటి సాయం అందలేదని వైట్ హౌస్‌లో ఆయన చేసిన ప్రకటన అతి పెద్ద అబద్ధమని అన్నారు.
"జెలెన్స్కీ చెప్పిన అబద్ధాల్లో కెల్లా అతి పెద్ద అబద్ధం 2022లో కీవ్ ప్రభుత్వానికి ఎటువంటి సాయం అందలేదని వైట్ హౌస్‌లో చెప్పడమే. ట్రంప్, వ్యాన్స్ జెలెన్స్కీని ఎలా విమర్శించకుండా ఆపుకున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇది సంయమనానికి నిదర్శనం" అని అన్నారు. జెలెన్ స్కీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో జరిగిన వాగ్వాదం తర్వాత జఖరోవా ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా భద్రతా మండలి డిప్యూటీ చీఫ్ దిమిత్రి మెద్వెదేవ్ మాట్లాడుతూ... ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడి చెంప ఛెల్లుమనిపించారు అని అన్నారు. మొదటిసారిగా ట్రంప్ కొకైన్ జోకర్‌కి చుక్కలు చూపించారన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వం మూడవ ప్రపంచ యుద్ధంతో ఆడుకుంటోందన్నారు. కాబట్టి ఇతర దేశాలు ఇకనైనా సైనిక సహాయం ఆపాలని ఆయన సూచించారు.