
Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ ల మధ్య నాలుగో రౌండ్ శాంతి చర్చలు సోమవారం జరగనున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్‌కీ సలహాదారు, చర్చల బృందంలో భాగమైన ఒకరు తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు దేశాలకు పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవిస్తున్న నేపథ్యంలో శాంతియుతంగా దీనిని పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా-ఉక్రెయిన్ ల మధ్య మరోసారి నాలుగో రౌండ్ శాంతి చర్చలు జరగనున్నాయి. వర్చువల్ గా ఈరోజు రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే మూడు సార్లు రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. అయితే, అవి సఫలం కాలేదు.
ఈ క్రమంలోనే నేడు నాల్గో రౌండ్ శాంతి చర్చలు జరగనున్నాయి. ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సహాయకుడు మైఖైలో పోడోల్యాక్ ట్విట్లర్.. “మళ్ళీ. వీడియో కాన్ఫరెన్స్‌ల ఫార్మాట్‌లో చర్చలు ఆగకుండా సాగుతాయి. దీని కోసం కార్యవర్గాలు నిరంతరం పనిచేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతర శ్రద్ధ అవసరం. మార్చి 14న, ప్రాథమిక ఫలితాలను సంగ్రహించడానికి చర్చల సెషన్ నిర్వహించబడుతుంది…” అని ట్వీట్ చేశారు. గతంలో, పోడోల్యాక్ మరియు రష్యన్ సంధానకర్త లియోనిడ్ స్లట్స్కీ.. రెండు దేశాల చర్చల్లో పురోగతి ఉందని ధ్రువీకరించారు. రాబోయే రోజుల్లో ఫలితాలు కార్యరూపం దాల్చవచ్చు అని పేర్కొన్నారు.
ఇదిలావుండగా, ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. పుతిన్ ఆదేశాలతో మరింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఆ దేశ నేతలు అణుబాంబు దాడులు గురించి ప్రస్తావించడం ఉక్రెయిన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా సైతం వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకుంటూ... తనపై ఆంక్షలు విధించిన దేశాలపై రష్యాలో కార్యకలాపాలు నిర్వహణపై ఆంక్షలు విధిస్తోంది.
రష్యా దాడుల పరంపర కొనసాగిస్తూ.. ఉక్రెయిన్ లోని ఏడు ఆస్పత్రులను రష్యా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. యుద్ధం కారణంగా ఆరుగురు వైద్యులు చనిపోగా.. మరో 12 మంది ప్రాణాలు నిలుపుకోవడానికి పోరాడుతున్నారు. కాగా, ఉక్రెయిన్ లోని డొనెట్స్క్ మరియు లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ లను స్వతంత్య్ర ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తూ.. ఆ దేశ రూపురేఖలు మారుస్తూ.. తన ఆధీనంలోకి తీసుకునే దిశగా ముందుకు సాగుతోంది. సాధారణ పౌర సమూహాలను సైతం రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకోవడంతో పెద్ద ఎత్తున పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.