
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఫేస్ బుక్ ను దేశంలో నిషేదించారు. ట్విట్టర్ కు పరిమితంగానే అనుమతులు ఇచ్చారు. ఈ సోషల్ మీడియా సైట్ లు నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్నాయని కారణం చూపుతూ.. ఉద్దేశపూర్వకంగా నకిలీ వార్తలను ప్రసారం చేయడాన్ని నేరంగా పరిగణించే బిల్లుపై ఆయన సంతకం చేశారు.
శుక్రవారం కూడా BBC, US ప్రభుత్వ నిధులతో నడిచే వాయిస్ ఆఫ్ అమెరికా, రేడియో ఫ్రీ యూరప్ లేదా రేడియో లిబర్టీ, జర్మన్ బ్రాడ్‌కాస్టర్ డ్యుయిష్ వెల్లే, లాట్వియా ఆధారిత వెబ్‌సైట్ మెడుజాను కూడా రష్యాలో నిషేదించారు. రష్యన్ భాషలో వార్తలను ప్రచురించే విదేశీ వార్త సంస్థలపైన పుతిన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్ పై దాడి గురించి దేశ ప్రజలు సమాచారాన్ని తెలుసుకోకూడదనే ఉద్దేశంతో కఠిన నియంత్రణలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు యాక్సెస్‌ను తగ్గించినట్లు స్టేట్ కమ్యూనికేషన్స్ వాచ్‌డాగ్ రోస్కోమ్నాడ్జోర్ తెలిపింది. రష్యా అధికారులు నిషేధించిన కంటెంట్‌ను తొలగించడంలో ట్విట్టర్ విఫలమైందని వాచ్‌డాగ్ గతంలో ఆరోపించింది.
ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం వల్ల యుద్దం విషయంలో రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తే, సమాచారాన్ని వ్యాప్తి చేస్తే వారికి చట్ట ప్రకారం 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. కాగా దీనికి స్పందిస్తూ అనేక పలు మీడియా సంస్థలు పరిస్థితిని అంచనా వేయడానికి రష్యాలో తమ పనిని నిలిపివేస్తామని తెలిపాయి. ఇందులో CNN రష్యాలో తమ ప్రసారాలను నిలిపివేస్తామని తెలపగా.. బ్లూమ్‌బెర్గ్, BBCలో పని చేసే జర్నలిస్టులు తాత్కాలికంగా తాము పని చేయడం ఆపేస్తామని తెలిపారు.
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక వైఫల్యాలు, పౌరుల మరణాల నివేదికలను నకిలీ వార్తలుగా రష్యా అధికారులు పదే పదే ఖండిస్తూ వస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని యుద్ధం, దండయాత్ర అని అనకూడదని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అయితే దీనిని ప్రత్యేక సైనిక చర్య గా అభివర్ణించాలని సూచిస్తోంది.
ఈ విషయంలో రష్యా పార్లమెంటులోని దిగువ సభ స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోడిన్ మాట్లాడుతూ.. తాము తీసుకున్న ఈ చర్య తమ సాయుధ దళాలను కించపరిచేలా అబద్దాలు ప్రసారంచేస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తుందని తెలిపారు. ‘‘ మా సైనికులు, అధికారులను రక్షించడానికి, సత్యాన్నికాపాడటానికి మేము దీనిని రూపొందించాం. ప్రతీ ఒక్కరూ దీనిని అర్థం చేసుకోవాలి. సమాజం కూడా అర్థం చేసుకుంటుందని నేను నేను అనుకుంటున్నాను ’’ అని ఆయన తెలిపారు.
రష్యా తీసుకున్న చర్యలపై మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ స్పందిస్తూ.. ‘‘ మిలియన్ల మంది సాధారణ రష్యన్లు నిజమైన సమాచారం నుంచి దూరం అవుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకరితో ఒకరు మాట్లాడలేకుండా మౌనంగా ఉండిపోతారు. మా సేవలను పునరుద్ధరించడానికి మేము చేయగలిగినదంతా చేస్తూనే ఉంటాం.’’ అని ఆయన ట్వీట్ చేశారు. దీని వల్ల
ఈ చట్టం ఇండిపెండెంట్ జర్నలిజం ప్రక్రియను నేరంగా పరిగణించేలా చేస్తోందని BBC డైరెక్టర్ జనరల్ టిమ్ డేవి అన్నారు. ‘‘ మాకు మా సిబ్బంది భద్రత చాలా ముఖ్యం. వారు ఉద్యోగాలు చేయడం వల్ల, వారిపై క్రిమినల్ కేసులకు గురి కావడం మాకు ఇష్టం లేదు. దీనికి మేము సిద్ధంగా లేము.’’ అని తెలిపారు. ఈ వారం మొదట్లో BBC ఉక్రెయిన్, రష్యాలోని కొన్ని ప్రాంతాలకు షార్ట్‌వేవ్ రేడియో ప్రసారాన్ని తిరిగి తీసుకువస్తున్నట్లు తెలిపింది. వీటి వల్ల ప్రజలు మాములు పరికరాలతో కూడా సమచారాన్ని వినవచ్చని తెలిపింది. అయితే రష్యాలోని పలు మీడియా సంస్థలు తమ వార్తల వల్ల భారీ ఆంక్షలు ఎదుర్కొవడానికి బదులు మూసివేయడమే మంచిదని నిర్ణయించుకున్నాయి. ఈ ముసాయిదా బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన కొద్దిసేపటికే తమ వైబ్ సైట్ మూసివేస్తున్నట్టు Znak తెలిపింది. అలాగే గురువారం రష్యా టాప్ ఇండిపెండెంట్ రేడియో స్టేషన్ ఎఖో మాస్క్వీ మూసివేతకు గురయ్యింది. దీంతో పాటు అధికారుల నుంచి బెదిరింపులు రావడంతో మరో ఇండిపెండెంట్ టీవీ స్టేషన్ Dozdh తన కార్యకలాపాలను నిలిపివేసింది.