Russia Ukraine Crisis : కైవ్ లోని స్కూల్ లో 200 మంది స్టూడెంట్ల‌కు ఆశ్ర‌యం క‌ల్పించిన ఇండియ‌న్ ఎంబసీ

Published : Feb 24, 2022, 11:48 PM IST
Russia Ukraine Crisis : కైవ్ లోని స్కూల్ లో 200 మంది స్టూడెంట్ల‌కు ఆశ్ర‌యం క‌ల్పించిన ఇండియ‌న్ ఎంబసీ

సారాంశం

ఉక్రెయిన్ లో ఉంటున్న భారత స్టూడెంట్లలో 200 మందికి కైవ్ లోని ఓ స్కూల్ లో ఇండియన్ ఎంబసీ రక్షణ కల్పించింది. దీనికి సంబంధించి ఇండియన్ ఎంబసీ ఓ వీడియో విడుదల చేసింది. 

ఇండియ‌న్ ఎంబ‌సీ ఉక్రెయిన్‌లో ఉన్న భార‌తీయులకు చేరువయ్యే ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తోంది. గురువారం కైవ్‌లోని ఎంబసీ సమీపంలోని ఓ స్కూల్ లో దాదాపు 200 మందికి పైగా భారతీయ విద్యార్థులకు వసతి కల్పించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇండియ‌న్ ఎంబ‌సీ విడుద‌ల చేసింది. ఇందులో ఉక్రెయిన్‌లోని భారత రాయబారి విద్యార్థులతో మాట్లాడుతున్నట్టు క‌నిపిస్తోంది. 

‘‘ఈ రోజు మీకు చాలా ఆందోళ‌న‌క‌రమైన‌ది. ఇండియాకు వెళ్లే మీ విమానాలు రద్దు అయ్యాయ‌ని మాకు స‌మాచారం ఉంది. మీకు మా అధికారులు ఆశ్ర‌యం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించుకున్నాం. అందుకే ఓ స్కూల్ లో మీకు అంద‌రికీ ఆశ్ర‌యం క‌లిపిస్తున్నాం.‘‘ అని భారత రాయబారి ఆ స్టూడెంట్ల‌కు చెప్పారు. 

కొంతకాలం క్రితం  దేశంలో ఉంటున్న భారతీయ విద్యార్థుల భద్రత కోసం ఉక్రెయిన్ ప్రభుత్వానికి రాయబార కార్యాలయం కూడా లేఖ రాసింది. ఇదిలా ఉండ‌గా.. ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తరలించడంలో సహాయం చేయడానికి MEA బృందాలను హంగేరీ, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్, రొమేనియాలోని ఉక్రెయిన్ భూ సరిహద్దులకు పంపుతున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఎంబసీ జారీ చేసిన తాజా సూచ‌న‌ల ప్ర‌కారం.. సైరన్లు, బాంబు హెచ్చరికలు వినిపించిన వెంట‌నే బాంబ్ షెల్టర్లలో ఆశ్రయం పొందాలని భారతీయ ప్రవాసులకు విజ్ఞప్తి చేశారు. ‘‘ నిర్దిష్ట ప్రదేశాలలో సైరన్లు బాంబు హెచ్చరికలు వినబడుతున్నాయని మాకు తెలుసు. మీరు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే గూగుల్ మ్యాప్స్‌లో సమీపంలోని బాంబు షెల్టర్‌ల జాబితా ఉంటుంది, వీటిలో చాలా ఆశ్రయాలు భూగర్భ మెట్రోలలో ఉన్నాయి.. దయచేసి మీ పరిసరాల గురించి తెలుసుకోండి. సురక్షితంగా ఉండండి. అవసరమైతే తప్ప మీ ఇళ్లను విడిచిపెట్టవద్దు. మీ పత్రాలను మీతో తీసుకెళ్లండి ’’ అని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా ఈరోజు తెల్లవారుజామున పూర్తి స్థాయి సైనిక దాడిని ప్రారంభించింది.

PREV
click me!

Recommended Stories

Longest Expressway Tunnel : ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ ఎక్కడో తెలుసా?
Viral News: ఉద్యోగుల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు డిపాజిట్.. నువ్వు బాస్ కాదు సామీ దేవుడివి