Russia Ukraine Crisis: ఆర్థిక ఆంక్షల నుంచి రష్యాను చైనా రక్షిస్తుందా? ‘మిత్రులే అయినా వ్యాపారంలో ప్రత్యర్థులే’

Published : Feb 26, 2022, 06:34 PM ISTUpdated : Feb 26, 2022, 06:47 PM IST
Russia Ukraine Crisis: ఆర్థిక ఆంక్షల నుంచి రష్యాను చైనా రక్షిస్తుందా? ‘మిత్రులే అయినా వ్యాపారంలో ప్రత్యర్థులే’

సారాంశం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టగానే అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించే పనిలో పడ్డాయి. ఇప్పటికే విధించిన దేశాలు మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని వెల్లడించాయి. ఇప్పటికే ఇలాంటి ఆంక్షలతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన రష్యా మరిన్ని ఆంక్షలు ఎదుర్కోవడం కత్తిమీద సామువంటిదే. కానీ, దానికి చైనా ఒక ఆశాదీపంగా కనిపిస్తున్నది. అయితే, నిజంగానే చైనా దేశం రష్యాను ఆంక్షల నుంచి గట్టెక్కించగలదా? అవి రెండు మిత్ర దేశాలే అయినప్పటికీ వ్యాపార విస్తరణలో రెండింటికీ గట్టి పోటీ ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.  

హైదరాబాద్: ఉక్రెయిన్‌(Ukraine)పై దాడి వద్దని అమెరికా(America), పశ్చిమ దేశాలు నెత్త నోరు ఒక్కటి చేసుకుని వాదించాయి. అయినా.. రష్యా(Russia) ఎంతమాత్రం వెనుకడుగు వేయలేదు. తాను అనుకున్నదే ఫైనల్ అన్నట్టుగా ఎంత ఒత్తిడి చేసినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఉక్రెయిన్‌పై ‘సైనిక చర్య’కు ఉపక్రమించింది. ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను కూడా తన గుప్పిట్లోకి తీసుకుంటున్నది. అయితే, సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ప్రకటించగానే అమెరికా, పశ్చిమ దేశాలూ హెచ్చరికలు చేశాయి. మరిన్ని కఠిన ఆర్థిక ఆంక్షల(Sanctions)ను రష్యాపై విధిస్తామని ప్రకటించాయి.

రష్యా దాడిని దాదాపు మేజర్ ఎకానమీ దేశాలు ఖండించాయి. ఒక్క చైనా మాత్రమే స్పష్టంగా ఖండించలేదు. ఈ రెండు దేశాలకు దగ్గరి సాన్నిహిత్యం ఉన్నది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ దేశాలు విధించే ఆర్థిక ఆంక్షలను తట్టుకోవడానికి రష్యాకు చైనా ఒక ఆశాదీపంగా కనిపిస్తున్నది. అయితే, నిజంగానే చైనా.. రష్యాను ఆదుకుంటుందా? రష్యాను ఆదుకోవడానికి ఉపక్రమించి అమెరికా, పశ్చిమ దేశాల్లోని మార్కెట్‌ను పోగొట్టుకునే రిస్క్ చేస్తుందా? అనేది కొంత చర్చించాల్సిన అంశాలే. ఎందుకంటే.. చైనాకు రష్యా కంటే ఎక్కువ ఐరోపా, అమెరికా దేశాలతో ఎక్కువ వాణిజ్యం ఉన్నది.

ఈ నేపథ్యంలోనే నిపుణులు ఏమంటున్నారంటే.. పశ్చిమ దేశాలు విధించే ఆంక్షల పరిమితిలోనే రష్యాకు చైనా సహకారం అందించనుంది. అంతేకాదు, రష్యాపై విధించే ఆంక్షలను ఆసరాగా తీసుకుని చైనా దేశ కంపెనీలు రష్యాలోని వనరులు, ఆ దేశ కంపెనీలతో బేరసారాలు చేయవచ్చు. 

2012లో చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రష్యా, చైనా సంబంధాలు మరింత గాఢమయ్యాయి. కానీ, ఆ రెండు దేశాల మాత్రం కూటమి కాదని నిపుణులు స్పష్టం చేశారు. రష్యాతో చైనా వాణిజ్యం 146.9 బిలియన్ డాలర్లకు చేరింది. కానీ, అమెరికా, ఐరోపా దేశాలతో చైనా 1.6 ట్రిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని నెరపుతున్నది. అంటే.. ఈ వాణిజ్యంలో రష్యాతో వాణిజ్యం పదింట ఒక వంతు మాత్రమే. కాబట్టి, రష్యాకు చైనా సహకారం ఏ మేరకు ఉంటుందంటే.. అది దాని ప్రయోజనాలను ఏ మేరకు రిస్క్ చేస్తుందన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పటికే అమెరికా దేశం నుంచి చైనా కొన్ని ఆంక్షలను ఎదుర్కొంటున్నది. మరిన్ని ఆంక్షలను చైనా కోరుకోవడం లేదు. అది దాని ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తుంది.

రష్యాకు చైనా సహకారం ప్రధానంగా గ్యాస్ కొనుగోలు రూపంలో ఉంటుందని తెలుస్తున్నది. చైనాకు గ్యాస్ అవసరాలు ఎక్కువ. రష్యా నుంచి ఈ కొనుగోళ్లను చైనా పెంచి పశ్చిమ దేశాలు విధించే ఆర్థిక ఆంక్షల నుంచి కొంత ఊరట ఇవ్వవచ్చు. ఈ గ్యాస్ కొనుగోళ్లపై ఈ దేశాల మధ్య 30 ఏళ్ల ఒప్పందం కుదిరింది. నిజానికి చైనాకు అవసరం అయ్యేంత మొత్తంలో రష్యా పైప్‌లైన్‌ల ద్వారా అందించలేకపోతున్నది. అలాగే, ఈ రెండు దేశాలు డాలర్ వినియోగాన్ని తగ్గించాలే ప్లాన్‌లు వేస్తున్నాయి. తద్వార అమెరికా ఆంక్షల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు.

ఇదిలా ఉండగా, చైనా, రష్యాలు మిత్ర దేశాలే అయినప్పటికీ వ్యాపార సామ్రాజ్య విస్తరణలో మాత్రం ఈ రెండు దేశాల మధ్య పోటీ ఉన్నది. ముఖ్యంగా రష్యాకు తూర్పు దేశాల్లోనూ చైనా వ్యాపారం విస్తరించడం పుతిన్‌కు నచ్చడం లేదు.

PREV
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే