ఉక్రెయిన్‌లోని ఆ నాలుగు భాగాలు రష్యావే.. విలీన ప్రకటన చేసిన పుతిన్, జెలెన్‌స్కీ అభ్యంతరం

By Siva KodatiFirst Published Sep 30, 2022, 8:18 PM IST
Highlights

ఉక్రెయిన్‌లో ఆక్రమించుకున్న జపోర్జియా, ఖేర్సన్, లుహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలు తమవేనని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు రష్యా భూభాగాన్ని విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌లో ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలు ఇక తమవేనని ఆయన ప్రకటించారు. ఈ మేరకు జపోర్జియా, ఖేర్సన్, లుహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలతో కలిపి రష్యా భూభాగాన్ని విస్తరిస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఈ ప్రాంతాలపై దాడి చేస్తే రష్యాపై దాడి జరిగినట్లుగా పరిగణిస్తామని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్‌లోని 15 శాతం భూభాగం రష్యాలో కలిసిందని.. తమ భూభాగాను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధమని పుతిన్ హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడి అధికారిక కార్యాలయం క్రెమ్లిన్‌లోని సెయింట్ జార్జ్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో నాలుగు ప్రాంతాలకు చెందిన అధిపతులు రష్యాలో విలీన ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే పుతిన్ ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. పుతిన్ ప్రకటన పనికిరానిదంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

అంత‌కుముందు.. దక్షిణ, తూర్పు ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాల విలీనానికి తమకు పూర్తి మద్దతు ఉందని రష్యా పేర్కొంది. జాపోరిజ్జియా , ఖెర్సన్, లుహాన్స్క్, డొనెట్స్క్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపినట్లు రష్యా తెలిపింది. జాపోరిజ్జియా ప్రాంతంలో 93%, ఖెర్సన్ ప్రాంతంలో 87%, లుహాన్స్క్ ప్రాంతంలో 98% , డొనెట్స్క్‌లో 99% బ్యాలెట్‌లు మద్దతు ఇచ్చాయని ర‌ష్యా నివేదించింది. దీంతో ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రావిన్సులను అధికారికంగా కలుపుకుంటామని రష్యా ముందే చెప్పింది.

ALso Read:నాలుగు ఉక్రెయిన్ భూభాగాలను రేపు అధికారికంగా తమలో కలుపుకోనున్న రష్యా

అయితే.. రెఫరెండం పేరుతో ఈ విలీనానికి ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అమెరికా, పాశ్చాత్య దేశాల అభ్యంతరాలను రష్యా తోసిపుచ్చింది. ఐదు రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించామని రష్యా చెప్పింది. ఇందులో లభించిన మద్దతు ఆధారంగా ఉక్రెయిన్‌కు చెందిన డొనెట్స్క్, లుహాన్స్క్, జపోర్జియా, ఖెర్సన్‌లను రష్యాలో విలీనం చేయనున్నట్టు,  ఇందుకోసం చట్టబద్ధంగా ఓటింగ్ జరిపినట్టు తెలిపింది. మరోవైపు... ఉక్రెయిన్‌లోని నాలుగు నగరాలు రష్యాలో విలీనమైన సందర్భాన్ని ప్రత్యేక రోజులా జరుపుకోవడానికి రష్యా సిద్ధమవుతోంది. రష్యా జాతీయ మీడియా శుక్రవారం నాటి కార్యక్రమాన్ని రెఫరెండం అందుకున్న వేడుకగా ప్రదర్శిస్తోంది.

గతంలో కూడా ఇలానే...

2008లో జార్జియాతో యుద్ధం తర్వాత.. రష్యా రెండు వేర్వేరు జార్జియా భూభాగాలను, అబ్ఖాజియా,  దక్షిణ ఒస్సేటియాలను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించింది. రష్యా కూడా ఈ రెండు భూభాగాలకు చాలా నిధులు సమకూర్చింది. దీని తరువాత.. ఇక్కడి ప్రజలకు రష్యా పౌరసత్వం ఇవ్వబడింది మరియు యువతను రష్యన్ సైన్యంలోకి చేర్చారు. అలాగే.. 2014లో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది.  అలాగే.. 22 ఫిబ్రవరి 2022న,  దొనేత్సక్, లుహాన్స్క్‌లను రష్యా స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించింది. ఈ రెండు ప్రాంతాలను డాన్‌బాస్ అని పిలుస్తారు. రష్యా ఈ ప్రకటన చేసిన రెండు రోజుల తరువాత, రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది, అది ఇప్పటికీ కొనసాగుతోంది.

click me!