
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌ను ఆయన సన్నిహితులే చంపేస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఆయన అంతరంగికులే చేతిలోనే ప్రాణాలు కోల్పోతాడని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమై ఈ నెల 24తో ఏడాది పూర్తైంది. ఇప్పటికీ యుద్దం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ క్రమంలోనే రూపొందించిన ‘‘ఇయర్’’అనే డాక్యూమెంటరీలో జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా న్యూస్‌వీక్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇక, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ఏడాది పూర్తయిన రోజునే ఈ డాక్యుమెంటరీ విడుదలైంది.
పుతిన్ నాయకత్వం అత్యంత బలహీనంగా మారే రోజులు వస్తాయని.. అత్యంత నమ్మకస్తులు అనుకున్నవారే అతడిపై తిరుగుబాటు చేస్తారని జెలెన్ స్కీ పేర్కొన్నారు. ‘‘రష్యాలో పుతిన్ పాలన దుర్బలత్వం అనుభూతి చెందే క్షణం ఖచ్చితంగా వస్తుంది. ప్రజలు విసిగిసోయిన రోజు పుతిన్ పతనం కావడం తథ్యం. కిల్లర్ ఇతర వేటగాళ్లు మింగేస్తారు. ఆ హంతకుడ్ని చంపడానికి వాళ్లకు అప్పటికి ఓ కారణాన్ని కనుగొంటారు. నేను చెప్పిన మాటలను వారు గుర్తుచేసుకుంటారు. అయితే ఇది ఎప్పుడూ జరుగుతుందనేది నేను కచ్చితంగా చెప్పలేను’’ అని జెలెన్ స్కీ పేర్కొన్నారు.
ఇక, పుతిన్ అంతర్గత సర్కిల్‌లో నిరాశ గురించి రష్యా నుంచి నివేదికలు వెలువడిన తరువాత.. జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రష్యా అధ్యక్షుడి సన్నిహిత మిత్రులు యుద్ధరంగం నుంచి రష్యా సైనికులు ఫిర్యాదులు, ఏడుస్తున్న వీడియోలు చూసిన తర్వాత పుతిన్ పట్ల విసుగు చెందుతున్నారని వాషింగ్టన్ పోస్ట్ ఇటీవల పేర్కొంది. అయితే ఇండిపెండెంట్ మాత్రం.. పుతిన్ సన్నిహితులు ఆయనను చంపే అవకాశం చాలా తక్కువ అని పేర్కొంది. వారిలో చాలా మంది ప్రభుత్వంలో వారి పదవులకు సంబంధించి ఆయనకు రుణపడి ఉన్నారని తెలిపింది.
ఇదిలా ఉంటే.. క్రిమియన్ ద్వీపకల్పంపై ఉక్రేనియన్ నియంత్రణకు తిరిగి రావడం యుద్ధం ముగింపులో భాగమని జెలెన్ స్కీ ఆదివారం చెప్పారు. ‘‘ఇది మన భూమి.. మన ప్రజలు.. మన చరిత్ర.. ఉక్రెయిన్‌లోని ప్రతి మూలకు ఉక్రెయిన్ జెండాను తిరిగి అందిస్తాం’’ అని జెలెన్ స్కీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.