
నాలుగు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఈజిప్ట్ రాజధాని కైరోలో అడుగుపెట్టారు. జూన్ 24 నుంచి 25 వరకు ఆయన ఈజిప్ట్‌లో పర్యటిస్తారు. ఆ దేశాధ్యక్షుడు అబ్ధెల్ ఫత్తా ఎల్‌సీసీ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటనకు వచ్చారు. జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బంధానికి కొనసాగింపుగా మోడీ ఈ పర్యటన చేపట్టారు. దాదాపు 26 ఏళ్ల తర్వాత ఈజిప్ట్‌లో ఒక భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. అంతేకాదు.. మోడీకి ఈజిప్ట్ ప్రధాని స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఈజిప్ట్ సాయుధ బలగాల నుంచి గార్డ్ ఆఫ్ హానర్‌ను మోడీ స్వీకరించారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ హోదాలో ఆయన తొలిసారిగా ఈజిప్ట్‌కు వచ్చారు.
మోడీ ఈజిప్ట్ పర్యటనకు సంబంధించి విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ దేశాధ్యక్షుడు ఎల్ సిసితో చర్చలు జరపడంతో పాటు ఈజిప్ట్ ప్రభుత్వానికి చెందిన అధికారులు, ఇతర ప్రముఖులు, అక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులను మోడీ కలుసుకోనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ఊతమిచ్చేలా ఆదివారం ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సిసితో మోడీ చర్చలు జరుపుతారు.
మరోవైపు ఈజిప్ట్ పర్యటనలో భాగంగా అల్ హకీమ్ మసీదును నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. అలాగే మొదటి ప్రపంచయుద్ధంలో ఈజిప్ట్ కోసం త్యాగాలు చేసిన భారతీయ సైనికులకు మోడీ నివాళుర్పించారు. ఈజిప్ట్ పర్యటనకు ముందుకు అమెరికా పర్యటన విజయవంతమైందని మోడీ ఓ వీడియోను పంచుకున్నారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి మనదేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని పేర్కొన్నారు.