Sri Lanka crisis: విద్యుత్ కోత‌లు.. పెరిగిన నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు.. శ్రీలంక‌లో భార‌మ‌వుతున్న బ‌తుకులు !

By Mahesh RajamoniFirst Published May 14, 2022, 4:16 AM IST
Highlights

Sri Lanka economic crisis: శ్రీలంక‌లో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు రికార్డు స్థాయికి పెరిగాయి. ఇప్ప‌టికే దేశంలో విద్యుత్ కొర‌త‌, పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లతో ప్ర‌జా ఇబ్బందులు అధిక‌మ‌య్యాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 
 

Sri Lankan families: 22 మిలియన్ల జనాభా ఉన్నశ్రీలంక లోని ప్రజలు చాలా నెలలుగా బ్లాక్‌అవుట్‌లు మరియు ఆహారం, ఇంధనం, మందుల కొరతతో పోరాడుతున్నారు. 1948లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శ్రీలంక ఎదుర్కొంటున్న అత్యంత దారుణ ప‌ర‌స్థితులు ఇవే. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. అధ్య‌క్షుడు తన వ్యక్తిగత నివాసం వెలుపల భారీ నిరసనల తర్వాత ఏప్రిల్ 1న కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే, అప్పుడు ఎమర్జెన్సీని ఏప్రిల్ 5న ఉపసంహరించుకున్నారు.  ప్ర‌జాగ్ర‌హం పెరిగి.. ఆందోళ‌న‌లు ఉధృతం ఆయిన త‌రుణంలో రెండో సారి ఈ నెల 6న ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. మ‌హీందా రాజ‌ప‌క్సే రాజీనామా చేసిన క్ర‌మంలో పెద్ద ఎత్తున ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకుని 10 మంది వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయార‌నీ, వంద‌ల మంది గాయ‌ప‌డ్డార‌ని రిపోర్టులు పేర్కొన్నాయి. 

శ్రీలంక తన విదేశీ రుణాలపై చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన తర్వాత శ్రీలంక దివాలా అంచుకు జారుకుంది.  దేశం 2026 నాటికి చెల్లించాల్సిన USD 25 బిలియన్లలో ఈ సంవత్సరం USD 7 బిలియన్ల విదేశీ రుణాల చెల్లింపులను ఎదుర్కొంటుంది. శ్రీలంక విదేశీ నిల్వలలో USD 1 బిలియన్ కంటే తక్కువగా నిల్వ‌లు ఉన్నాయి. విదేశీ కరెన్సీ సంక్షోభం దిగుమతులను పరిమితం చేసింది. దీంతో ఇంధనం, వంటగ్యాస్, మందులు, ఆహారం వంటి నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రజలు తాము చేయగలిగిన వాటిని కొనడానికి గంటల తరబడి పెద్ద వరుసలలో ఉండాల్సిన ప‌రిస్థితి దాపురించింది. వాటి ధ‌ర‌లు సైతం రికార్డుల మోత మోగిస్తున్నాయి. 

దేశంలో తీవ్ర‌మైన విద్యుత్ కోతలు, పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు శ్రీలంక కుటుంబాల రోజువారీ జీవితాల‌ను మ‌రింత భారంగా మారుస్తున్నాయి. "కరెంటు లేదు, రైస్ కుక్కర్‌లో అన్నం వండలేకపోతున్నాం. ఎల్‌పీజీ గ్యాస్‌ కూడా దొరకడం చాలా కష్టం. కాబట్టి వీలైనంత వరకు ఆదా చేయాలి. నా బిడ్డకు అన్నం పెట్టలేకపోతున్నాం” ఓ కుటుంబం మీడియాతో అన్న మాట‌లు ప్రస్తుతం వైర‌ల్ గా మారాయి. ఇదిలావుండ‌గా,  శ్రీలంక ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై హింసాత్మక దాడుల కేసులో భాగంగా దేశ మాజీ ప్రధానమంత్రి మహింద రాజపక్స, ఆయన కొడుకు నమల్ రాజపక్స, మరో 15 మంది అనుచరులు బయటి  దేశాలకు వెళ్లకుండా కోర్టు నిషేధాజ్ఞలు విధించింది. సోమవారం నాడు శ్రీలంకలో జరిగిన మూక దాడులపై దర్యాప్తు చేయాలని రాజధాని కొలంబోలోని మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించింది. అంతేకాదు, మహింద రాజపక్సకు వ్యతిరేకంగా అరెస్టు వారెంట్ జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. ఎందుకంటే.. కేసు విచారిస్తున్న పోలీసులకు అనుమానితులను అరెస్టు చేసే అధికారాలు ఎలాగూ ఉంటాయి కదా అని పేర్కొంది.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డప్పటి నుంచి ప్రధానమంత్రి, అధ్యక్షుడు, ఇతర మంత్రులు రాజీనామాలు చేయాలని ప్రజలు శాంతియుత నిరసనలు చేస్తున్నారు. అప్పటి ప్రధానమంత్రి మహింద రాజపక్స నివాసం ఎదుట కూడా ఈ ప్రదర్శనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మహింద రాజపక్స నివాసానికి సుమారు 3000 మంది అనుచరులు ఇతర చోట్ల నుంచి రాజధానికి బస్సుల్లో రప్పించారు. వారు మహింద రాజపక్సతో భేటీ అయిన తర్వాత ఆయన నివాసం నుంచి బయటకు వచ్చి శాంతియుత ఆందోళన చేస్తున్న నిరసనకారులపై విరుచుకుపడ్డారు. హింసకు తెరలేపారు. ప్రతిదాడిగా దేశవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అధికార నాయకులు, వారి ఆస్తులపై ఆందోళనకారులు దాడులు చేశారు. 

click me!