గర్భిణి అయిన భారత పర్యాటకురాలి మృతి.. రాజీనామా చేసిన పోర్చుగల్ ఆరోగ్య శాఖ మంత్రి

By Sumanth KanukulaFirst Published Sep 1, 2022, 9:37 AM IST
Highlights

పోర్చుగల్ ఆరోగ్య శాఖ మంత్రి మార్టా టెమిడో మంగళవారం రాజీనామా చేశారు. గర్భిణి అయిన భారతీయ పర్యాటకురాలి మరణించిన కొన్ని గంటల తర్వాత మార్టా టెమిడో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

పోర్చుగల్ ఆరోగ్య శాఖ మంత్రి మార్టా టెమిడో మంగళవారం రాజీనామా చేశారు. గర్భిణి అయిన భారతీయ పర్యాటకురాలి మరణించిన కొన్ని గంటల తర్వాత మార్టా టెమిడో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు చెందిన 34 ఏళ్ల గర్భిణీ.. ఆస్పత్రిలో బెడ్ అందుబాటులో లేకపోవడంతో లిస్బన్‌లోని ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు అక్కడి స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. స్థానిక మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. భారతీయ మహిళ 31 వారాల గర్భవతి. ఆమె శ్వాస ఆడటం లేదని చెప్పిన తర్వాత దేశంలోని అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో ఒకటైన శాంటా మారియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే ఆ ఆస్పత్రిలోని నియోనాటాలాజీ విభాగం పూర్తిగా నిండి ఉండటంతో.. ఆమెను అక్కడి నుంచి సావో ఫ్రాన్సిస్కో జేవియర్ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో ఆమె గుండెపోటుకు గురైంది. ఇక, సావో ఫ్రాన్సిస్కో జేవియర్ ఆస్పత్రిలో ఆమెకు అత్యవసరంగా సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. నవజాత శిశువును నియోనాటల్ కేర్ యూనిట్‌లో చేర్చారు. అయితే ఆమె మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఇక, మహిళ మరణంపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించినట్లు బీబీసీ పేర్కొంది.

ఇక, టెమిడో 2018లో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కోవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయం సాధించడంతో టెమిడో మంచి పేరు సంపాదించుకున్నారు. వేసవి సెలవుల్లో పలు ఆసుపత్రుల్లో సరిపడా వైద్యులు లేకపోవడంతో ముఖ్యంగా వారాంతాల్లో అత్యవసర ప్రసూతి సేవలను మూసివేయాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆస్పత్రులలో ప్రసూతి యూనిట్లు నిండిపోతుండడంతో గర్భిణులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే వారు ఆస్పత్రుల మధ్య  ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఆరోగ్య మంత్రిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

టెమిడో ‘‘ఇకపై పదవిలో కొనసాగే పరిస్థితులు లేవని గ్రహించినందున’’ పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పోర్చుగల్ ప్రధాన మంత్రి ఆంటోనియో కోస్టా.. టెమిడో రాజీనామాపై స్పందించారు. టెమిడో చేసిన అన్ని పనులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో టెమిడో సేవలను కొనియాడారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంస్కరణలను కొనసాగిస్తామని ప్రధాన మంత్రి కోస్టా హామీ ఇచ్చారు.

click me!