
న్యూఢిల్లీ: స్కూల్స్‌లో అమ్మాయిలు వేసుకునే పోనీ టెయిల్స్ అబ్బాయిలను ఉద్రేకపరుస్తుందని చెబుతూ వాటిపై నిషేధం విధించారు. ఇలాంటి మరెన్నో అర్థం లేని నిబంధనలు విధించడంలో జపాన్‌కు చెడ్డ పేరు ఉన్నది. ఇది వరకు అది విధించిన పలు నిబంధనలు వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు అదే కోవలో పోనీ టెయిల్స్‌పై నిషేధం విధించాలనే నిబంధనలు తెచ్చింది. ఓ రిటైర్డ్ స్కూల్ టీచర్ మాట్లాడుతూ, తమ స్కూల్ యాజమాన్యం తమకు ఈ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. పోనీ టెయిల్స్ వేసుకుంటే.. అమ్మాయిల జుట్టు కింద మెడ భాగం బయటకు స్పష్టంగా కనిపిస్తుందని, ఆ మెడ భాగం అబ్బాయిలను లైంగికంగా ఉద్రేకపరుస్తుందని స్కూల్ యాజమాన్యం తమకు తెలిపిందని చెప్పారు. గతంలో గర్ల్స్ ధరించే అండర్‌వేర్ కలర్‌లనూ జపాన్ స్కూల్స్ నిర్దేశించాయి. వేర్వేరు రంగు అండర్ వేర్‌లతో అబ్బాయిలు అమ్మాయిల వైపు చూసే ముప్పు ఎక్కువ అని, కాబట్టి, వైట్ అండర్ వేర్‌లే ధరించాలని ఆదేశాలు ఇచ్చాయి.
అయితే, ఇలాంటి వివాదాస్పద ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ వాటిని వ్యతిరేకించేవారు లేదా విమర్శించేవారు చాలా తక్కువగా ఉన్నారు. అందుకే, ఆ నిబంధనలను విద్యార్థినులు పాటించకతప్పడం లేదు. 2020 సర్వే ప్రకారం,ఫుకుఒకా నగరం దక్షిణ భాగంలోని పాఠశాలల్లో ప్రతి పదింట ఒకదాంట్లో పోనీ టెయిల్‌ను నిషేధించారని తేలింది.
జపాన్ పాఠశాలల నిబంధనలు నిర్హేతుకంగా, అసంబద్ధంగా ఉంటున్నాయి. అంతేకాదు, అవి తిరోగమనంగా ఉన్నాయి. కానీ, వాటిని వ్యతిరేకించేవారు కరువయ్యారు. ఉదాహరణకు మెడ బయటకు కనిపిస్తుందని పోనీ టెయిల్ నిషేధించిన స్కూల్స్.. అదే మెడ బయటకు కనిపించే ఆస్కారం ఉ:డే బాబ్ హెయిర్ స్టైల్‌ను అనుమతిస్తున్నది. కాగా, అండర్ కట్‌ను మాత్రం నిషేధించింది. అసలు కొన్ని సార్లు నిషేధం దేనిపై ఎందుకు విధిస్తున్నారో కూడా కనీసం వివరణ ఇవ్వని సందర్భాలు ఉన్నాయి.
జపాన్ పాఠశాలల్లో విధించే నిబంధనలు నేడు ఉత్తర కొరియాలో అమలు చేస్తున్న ఆదేశాలు గుర్తుకు తెస్తున్నాయి. పశ్చిమ దేశాల సంస్కృతికి యువత ఆకర్షితం కావొద్దని ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ కొన్ని సంచలన ఆదేశాలు జారీ చేశారు. అందులో హెయిర్ స్టైల్స్ కూడా ఉన్నాయి. సూచిత హెయిర్ స్టైల్స్ కాకుండా వేరే స్టైల్‌తో జుట్టు కత్తిరించుకోరాదు అన్నమాట. ఆ దేశంలో 215 రకాల హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. ఆ దేశంలోని అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ ఆ లిస్టులోని హెయిర్ స్టైల్స్‌ను మాత్రం కలిగి ఉండాలి. లేదంటే కొరడా విధుల్చుతారంతే. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హయిర్ స్టైల్ కూడా గమ్మత్తుగా అంటే.. కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. కొంత మంది ఆయన హెయిర్ స్టైల్స్‌నూ ఫాలో అవుతుండటం గమనార్హం. దేశ అదినేత కాబట్టి, ఆయనను ఫాలో అయ్యే వారు ఉంటే.. ఆ హెయిర్ స్టైల్ నచ్చి ఫాలో అయ్యే వారూ ఉండటం గమనార్హం. ఉత్తర కొరియా వెలుపల కూడా ఓ వ్యక్తి కిమ్ హెయిర్ స్టైల్‌తో స్టైలింగ్ చేయించుకుని ఆయన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.