
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా అమెరికా, పశ్చిమ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కఠిన ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తుండటంతో రష్యా తాజాగా, ఆ దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమపై ఆంక్షలు విధిస్తే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ముప్పు ఉందని, అది కూలిపోవచ్చని హెచ్చరించింది. అదే విధంగా ఒక అమెరికన్ వ్యోమగామి భవితవ్యం కూడా ప్రశ్నార్థకం అవుతుందని తెలిపింది.
అమెరికా వ్యోమగామి మార్క్ వాన్‌డె హెయి అంతరిక్షం నుంచి మరో మూడు వారాల్లో భూమిపైకి తిరిగిరానున్నారు. అంతరిక్ష కేంద్రంలో ఆయన సుమారు ఏడాది పాటు గడిపారు. రష్యన్ వ్యోమనౌక పై ఆయన భూమి పైకి బయల్దేరనున్నారు. ఈ విషయాన్ని రష్యన్ స్పేస్ ఏజెన్సీ ప్రస్తావించింది. పశ్చిమ దేశాలు, అమెరికా విధిస్తున్న ఆంక్షల కారణంగా ఆయనను అంతరిక్ష కేంద్రంలోనే వదిలిపెట్టాల్సి రావొచ్చని, ఆ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా కూలిపోయే ముప్పు ఉందని, అదీ అమెరికాపై కూలిపోయే అవకాశాలూ ఉన్నాయని ఓ సోషల్ మీడియా పోస్టులో రష్యన్ స్పేస్ ఏజెన్సీ హెడ్ దిమిత్రి రొగోజిన్ హెచ్చరించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్వహణకు ఉపయోగపడే తమ వెస్సల్ సేవలపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు ప్రభావం వేయవచ్చునని చెప్పారు. ఈ వెస్సల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సరైన కక్షలో ప్రయాణించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. తద్వార 500 టన్నుల బరువున్న ఈ అంతరిక్ష కేంద్రం క్రాష్ అయిపోవచ్చని, అది నేలపై లేదా సముద్రంలో పడిపోవచ్చని పేర్కొన్నారు.
కాగా, అమెరికా మాజీ వ్యోమగామి స్కాట్ కెల్లీ ఈ హెచ్చరికలపై తీవ్రంగా స్పందించారు. అవి కేవలం హెచ్చరికలేనని, అలా చేసే ధైర్యం రష్యాకు లేదు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏబీసీ న్యూస్‌తో స్కాట్ కెల్లీ మాట్లాడుతూ, ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు వింటామని తాను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఇది ఓ పిచ్చి వార్నింగ్ అని పేర్కొన్నారు. వాస్తవ అంశాల ఆధారంగా చేసిన హెచ్చరిక కాదని చెప్పారు. రష్యన్ స్పేస్ ఏజెన్సీ సహకారం లేకుండా తాము స్వతంత్రంగా అంతరిక్ష కేంద్రం కక్ష్యను నియంత్రించగలం అని తెలిపారు. కాబట్టి, రష్యా చెప్పేట్టుగా జరగదని పేర్కొన్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రస్తుతం రెండు సెక్షన్‌లుగా విభజితమై ఉన్నది. ఒక సెక్షన్ అంటే రష్యన్ ఆర్బిటల్ సెగ్మెంట్‌ను ఆ దేశమే కంట్రోల్ చేస్తుంది. కాగా, అమెరికా ఆర్బిటల్ సెగ్మెంట్‌ను అమెరికా ఆపరేట్ చేస్తుంది. కానీ, ఇటీవల ఈ రెండు దేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉన్నది. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉనికిపైనా సందేహాలు వస్తున్నాయి.
గతవారం రొగోజిన్, కెల్లీల మధ్య పబ్లిక్‌గా సోషల్ మీడియాలో వాగ్వాదం జరిగింది. రొగోజిన్ ఓ వీడియోను షేర్ చేసి పేర్కొన్న వ్యాఖ్యలు మరో వైపు నుంచి ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆయన షేర్ చేసిన వీడియోలో రష్యన్ ఆస్ట్రోనట్లు బ్రిటీష్, అమెరికన్ జెండాలతో రష్యా సోయుజ్ రాకెట్ దగ్గర కనిపించారు. బైకనూర్ దగ్గర రాకెట్ ప్రయోగించే తమ నిపుణులు కొన్ని దేశాల జెండాలను తొలగించాలని నిర్ణయించారు. తద్వార తమ రాకెట్లు మరింత సుందరంగా కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.