కందుల జాహ్నవి మరణం పట్ల పోలీసు అధికారి ప్రవర్తించిన తీరుపై సియాటెల్ మేయర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన భారతీయ సమాజానికి క్షమాపణలు చెప్పారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలియజేశారు.
అమెరికాలో కందుల జహ్నవి రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల సియాటెల్ పోలీసులు అధికారి చేసిన అనుచిత వ్యాఖ్యలపై సియాటెల్ మేయర్ క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాహ్నవి గురించి నవ్వుతూ, హేళన చేస్తూ డేనియల్ ఆడెర్ చేసిన వ్యాఖ్యలకు మేయర్ బ్రూస్ హారెల్ భారతీయ సమాజానికి క్షమాపణలు చెప్పారు.
‘‘పోలీసు అధికారి దురదృష్టకరమైన, సున్నితమైన వ్యాఖ్యలు చేశారని నేను నమ్ముతున్నాను. నగర అధికారులుగా భారతీయ సమాజానికి మా క్షమాపణలు. బాధిత కుటుంబ కుటుంబ సభ్యులకు, మీకు జరిగిన ష్టానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై సియాటెల్ పోలీస్ చీఫ్ అడ్రియన్ డియాజ్ కూడా విచారణం వ్యక్తం చేశారు. జాహ్నవి మృతి పట్ల సంతాపం తెలిపారు. ‘‘ఇలాంటి ఘటనలు మళ్లీ ఎప్పుడూ జరగకుండా చూసుకుంటాం. మానవ ప్రాణాలకు మేము విలువ ఇస్తున్నామం’’ అని చెప్పారు.
కాగా.. ఘటన జరిగిన ప్రాంతంలోని భారతీయ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సుమారు 20 మంది శనివారం సియాటెల్ మేయర్, పోలీస్ చీఫ్ ను కలిసిన సందర్భంగా వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క ఇతర దేశస్తుడు సురక్షితంగా, గౌరవంగా ఉండే సియాటెల్ ను సృష్టించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
ఇదిలా ఉండగా కందుల జాహ్నవి మృతిపై సత్వర, నిష్పాక్షిక దర్యాప్తు చేస్తామని అమెరికా ప్రభుత్వం భారత్ కు హామీ ఇచ్చింది. ఆమె మరణం పట్ల పోలీసులు అధికారి ప్రవర్తించిన తీరుపై చర్యలు తీసుకోవాలని భారత కాన్సులేట్ అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.
కందుల జాహ్నవి నార్తీస్ట్రన్ విశ్వవిద్యాలయంలోని సీటెల్ క్యాంపస్‌లో ఆమె మాస్టర్స్ చదువుకునేందుకు అమెరికాకు వెళ్లారు. అయితే ఈ ఏడాది జనవరి 23వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమెను ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే.. దానిని దర్యాప్తు చేసేందుకు డేనియల్ అడెరెర్ అనే పోలీసులు అధికారి అక్కడికి వచ్చారు. జాహ్నవి మరణాన్ని హేళన చేస్తూ మాట్లాడాడు. ఆమె ఓ సాధారణ మనిషి అని, ఆమె మరణానికి విలువ లేదని, ఆమెకు 26 ఏళ్ల వయస్సు ఉండొచ్చని పేర్కొన్నారు. ఓ 11 వేల డాలర్ల చెక్కు రాయాలని ఆయన ఎవరితోనో ఫోన్ లో సంభాషించాడు. అయితే ఇదంతా అతడి బాడీ కెమెరాలో రికార్డు అయ్యింది. అది వైరల్ కావడంతో అతడిపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.