
ఉక్రెయిన్‌పై రష్యా దాడి (ukraine russia crisis) నేపథ్యంలో అక్కడ చదువుకోవడానికి వెళ్లిన వేలాది మంది భారతీయ విద్యార్ధులు (indian students) తీవ్ర ఇబ్బందులు పడుతోన్న సంగతి తెలిసిందే. అక్కడి పరిస్ధితుల నేపథ్యంలో వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర విదేశాంగ శాఖ (ministry of external affairs ) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేయడంతో తరలింపు కష్టమవుతోంది. దీంతో వారిని దేశ పశ్చిమ ప్రాంతం మీదుగా పోలాండ్, హంగేరీ, రోమేనియా సరిహద్దులకు తరలించి.. అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు పంపుతున్నారు అధికారులు.
అయితే భారతీయ విద్యార్థులపై పోలెండ్ పోలీసులు (poland police) దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి రోడ్డు మార్గాన పోలెండ్ సరిహద్దులకు వచ్చిన భారత విద్యార్థులపై అక్కడి పోలీసులు నేరస్తులతో ప్రవర్తించినట్లుగా ప్రవర్తించారు. విద్యార్థులను క్యూలైన్లలో నిలబడుతూ ఎవరైనా పక్కకు జరిగితే కాళ్లతో తన్నారు. కొంతమందిని క్రూరంగా మెడలు పట్టి నెట్టివేస్తున్న దృశ్యాలు టీవీల్లో, ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. మరికొందరిని కాళ్లు, చేతులు పట్టి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
పోలాండ్ సరిహద్దులకు వస్తున్న వారితో అక్కడి రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జనం రద్దీని నియంత్రించే క్రమంలో పోలీసులు సహనం కోల్పోయారు. ఆపదలో ఉన్నవాళ్లు అనే కనికరం లేకుండా వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఆడవాళ్లు కాళ్లు మొక్కితేనే సరిహద్దు దాటి రావాలని, మగవాళ్లు తాము చెప్పిన గేమ్ ఆడితేనే రావాలంటూ పోలీసులు షరతులు పెట్టినట్లు బాధితులు వాపోతున్నారు. పోలెండ్ పోలీసుల దురుసు ప్రవర్తనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో ఈ ఘటనపై నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతకుముందు పోలాండ్‌లో ఇండియన్ ఎంబసీ ఇటీవల విడుదల చేసిన అడ్వైజరీలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయలును తరలింపు ప్రక్రియకు సూచనలు చేసింది. పశ్చిమ ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులను పోలాండ్ ద్వారా భారతదేశానికి తరలించాలని చూస్తున్నట్టుగా తెలిపింది. తరలింపు కోసం ఏర్పాటు చేయబడిన రాయబార కార్యాలయాల కో-ఆర్డినేట్‌లను గమనించాలని కోరింది. అందుకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా జత చేసింది.గూగుల్ ఫామ్‌లో వివరాలు రిజిస్టర్ చేయాలని పేర్కొంది.
ఇక, పోలాండ్ ప్రభుత్వం Shehyni-Medyka సరిహద్దు పాయింట్ ద్వారా కాలినడకన మాత్రమే జనాలు సరిహద్దు దాటడానికి అనుమతిస్తోంది. Krakowiec crossing వద్ద వారి వాహనాల్లో ప్రయాణించే వ్యక్తులకు మాత్రమే అనుమతిస్తోంది. ఇక, ఇప్పటికే కొందరు భారతీయులు పోలాండ్ సరిహద్దులకు చేరుకన్న సంగతి తెలిసిందే. అయితే భారతీయుల తరలింపు ప్రక్రియకు సంబంధించి పోలాండ్ నుంచి శుభవార్త అందించింది. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ నుంచి తప్పించుకున్న భారతీయ విద్యార్థులందరినీ ఎలాంటి వీసా లేకుండానే పోలాండ్‌లోకి అనుమతించనున్నట్టుగా భారత్‌లోని ఆ దేశ రాయబారి Adam Burakowski తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో ప్రకటన చేశారు.