
న్యూఢిల్లీ: నేపాల్‌లో విమాన ప్రమాదం మరువక ముందే మరో ఆందోళనకర వార్త ముందుకు వచ్చింది. విమానాన్ని నడుపుతూనే పైలట్లు నిద్రలోకి జారుకున్నారు. పైలట్‌తోపాట కో పైలట్ కూడా కునుకు తీశారు. గ్రౌండ్ స్టేషన్స్ నుంచి సిబ్బంది ఎంతగా ట్రై చేసినా.. వారు రెస్పాండ్ కాలేదు. సుమారు పది నిమిషాలపాటు పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో గ్రౌండ్ స్టేషన్ సిబ్బందిలో అనుమానాలు బయల్దేరాయి. బహుశా టెర్రరిస్టులు ఆ ప్లేన్‌ను హైజాక్ చేస్తున్నారేమోనని ఆందోళనలు చెందారు. కానీ, వారు నిద్రలోకి జారుకున్నారనే విషయం తర్వాత తెలియవచ్చింది. దీంతో ఆ ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించారు.
న్యూయార్క్ నుంచి ఇటీలోని రోమ్‌కు ఇటలీ ప్రభుత్వ వైమానిక సంస్థ ఐటీఏ ఎయిర్‌లైన్స్ ఏజెడ్ 609 ప్యాసింజర్ ఫ్లైట్ బయల్దేరింది. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో పెట్టారు. అంటే.. నార్మల్ స్పీడ్, ఆల్టిట్యూడ్‌తో విమానం ఎగురుతుంది. సాధారణ వేగం, ఎత్తుల్లో ప్రయాణిస్తుంది. అంతేకాదు, నిర్ణీత మార్గంలోనే తప్పితే దారి మళ్లదు. ఈ మోడ్‌లో పెట్టిన తర్వాత పైలట్ నిద్రలోకి వెళ్లిపోయాడు. కో పైలట్ కూడా ఈ ఆటో పైలట్ మోడ్ పెట్టేసి నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ట్రాఫిక్ కంట్రోలర్స్ వారిని సంప్రదించే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. పది నిమిషాలపాటు వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 10 నిమిషాల తర్వాత పైలట్లు రెస్పాండ్ అయ్యారు.
అయితే.. ఇంతలోపే ట్రాఫిక్ కంట్రోలర్స్ అనుమానాల్లోకి వెళ్లారు. ఆ ఫ్లైట్‌ను టెర్రరిస్టులు హైజాక్ చేస్తున్నట్టు ఉన్నారని ఫ్రెంచ్ అధికారులు.. ఇటలీ అధికారులను అప్రమత్తం చేశారు. అంతేకాదు, రెండు నిఘా ఫైటర్ జెట్లను ఫ్రెంచ్ ప్రభుత్వం సిద్ధం చేసింది.
కానీ, పది నిమిషాల తర్వాత పైలట్ల నుంచి రియాక్షన్ వచ్చింది. పది నిమిషాల నుంచి ట్రాఫిక్ కంట్రోలర్స్‌కు స్పందించకపోవడానికి గల కారణం ఏమిటని వారిని అధికారులు ప్రశ్నించారు. అయితే, ఆ పరికరంలో ఏదో మాల్‌ఫంక్షన్ ఏర్పడి ఉండొచ్చని, అందుకే తాము సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయామని తెలిపారు. అయితే, ఈ విషయమై అంతర్గత దర్యాప్తు చేపట్టారు. కానీ, అలాంటి లోపమేదీ కనిపించలేదు. దీంతో ఆ పైలట్లను మళ్లీ ప్రశ్నించారు. దీంతో వారు ఆ సమయంలో నిద్రలోకి జారుకున్నట్టు తేలిందని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటన తర్వాత పైలట్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించారు. కాగా, ఆ వైమానిక సంస్థ ప్రతినిది మాట్లాడుతూ, ప్రయాణికుల సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని వివరించారు. టెక్నాలజీ వల్ల వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే అవకాశాలు ఫ్లైట్‌లో ఉన్నాయని తెలిపారు.