ప్లేన్‌లో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు: అధికారులు.. అందులో నలుగురు మహారాష్ట్ర వాసులు

By Mahesh KFirst Published May 30, 2022, 2:08 PM IST
Highlights

నేపాల్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ముస్తాంగ్ జిల్లాలో 14,500 అడుగుల ఎత్తులో తారా ఎయిర్ విమానం కూలింది. ప్రమాద సమయంలో విమానంలో 22 మంది మరణిస్తున్నారు. ఇందులో నలుగురు మహారాష్ట్ర వాసులు ఉన్నారు. ఇప్పటి వరకు ప్రమాద స్థలిలో విమాన శకలాల నుంచి సుమారు 14 మృతదేహాలను సిబ్బంది వెలికి తీసింది.
 

న్యూఢిల్లీ: నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులు అందరూ మరణించి ఉంటారని అధికారులు చెప్పారు. ప్రమాదంలో నేల కూలిన తారా ఎయిర్ విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మరణించి ఉంటారని ఓ ప్రభుత్వ అధికారి ఈ రోజు వెల్లడించారు. ఈ విమానం నేలకూలిన ప్రాంతాన్ని ట్రేస్ చేసిన అధికారులు విమాన శకలాల నుంచి మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాద సమయంలో విమానంలో 22 మంది ఉన్నారు. అందులో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు.

నేపాల్ హోం శాఖ ప్రతినిధి ఫదీంద్ర మణి మాట్లాడుతూ, ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ మరణించినట్టుగా అనుమానిస్తున్నట్టు తెలిపారు. తమ ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ విమాన ప్రమాదం నుంచి ప్రయాణికులు తప్పించుకునే అవకాశాలు లేవని వివరించారు. అయితే, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు విమాన శకలాల నుంచి సుమారు 14 మృతదేహాలను సిబ్బంది వెలికి తీసింది.

ఈ రోజు ఉదయమే విమాన ప్రమాద స్థలిని అధికారులు గుర్తించి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సుమారు 20 గంటల తర్వాత రెస్క్యూ సిబ్బంది స్పాట్‌కు చేరుకుంది.

విమానంలోని ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఎయిర్‌లైన్ ఆ విమానంలో ప్రయాణించిన వారి వివరాల జాబితాను విడుదల చేసింది. అందులో నలుగురు భారతీయులు అశోక్ కుమార్ త్రిపాఠి, ఆయన భార్య వైభవి బందేకర్ త్రిపాఠి, వారి పిల్లలు ధనుష్, రితికాల పేర్లు ఉన్నాయి. వీరు మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. ముంబయి సమీపంలోని థానే నగరానికి వీరు చెందినవారిగా గుర్తించారు. వైభవి బందేకర్ త్రిపాఠి కుటుంబం విమాన ప్రమాదంలో మరణించినట్టుగా తన తల్లికి తెలియజేయవద్దని ఆమె సోదరి అధికారులకు విజ్ఞప్తి చేసింది. తన తల్లి ఆరోగ్య స్థితి ప్రమాదకరంగా ఉన్నదని, కాబట్టి, ఈ బ్యాడ్ న్యూస్ చెప్పవద్దని కోరింది.

నేపాల్‌లో ముస్తాంగ్ జిల్లాలో సుమారు 14,500 అడుగుల ఎత్తులో సానో స్వరే భిర్ అనే చోట విమాన ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు పొఖారా నగరం నుంచి జామ్సమ్ టూరిస్టు నగరానికి తారా ఎయిర్‌కు చెందిన టర్బోప్రాప్ ట్విన్ ఆటర్ 9ఎన్ ఏఈటీ విమానం బయల్దేరింది. కానీ, బయల్దేరిన పది నిమిషాల్లోనే అది కాంటాక్ట్ మిస్ అయింది. అనంతరం, ఈ విమానం ముస్తాంగ్ జిల్లాలో నేలకూలినట్టుగా తెలిసింది.

click me!