
Russia Ukraine war: భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై కూలంకషంగా చర్చించారు. యుద్ధ భూమి ఉక్రెయిన్ సమగ్రతను, ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కచ్చితంగా గౌరవించాల్సిందేనని ఇరువురూ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా శాంతి సామరస్యాలు వెల్లివిరియాలంటే.. అంతర్జాతీయ చట్టాలను తప్పనిసరిగా గౌరవించాలని ఇరు దేశాలు అభిప్రాయపడ్డారు.
ఇరు దేశాలు యుద్దాన్ని నిలిపివేసి.. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటే బాగుటుందని మోదీ , జాన్సన్‌తో పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలు, భౌగోళిక సమగ్రతపై భారత్‌కు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయని మోదీ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఇరువురు దేశాల నాయకులు ద్వైపాక్షిక ప్రయోజనాలపై కూడా చర్చించారు. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు, రక్షణ & భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించాల్సిన అవసరముందని ఇరు నేతలు అంగీకరించారు.
అలాగే.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల సానుకూల ధోరణిపై ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా.. గతేడాది ఇరువురు నేతల మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ సందర్భంగా ఆమోదించిన 'ఇండియా-యుకె రోడ్‌మ్యాప్ 2030' అమలులో పురోగతిని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఇక… భారత పర్యటనకు రావాలని ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని జాన్సన్‌ను ఆహ్వానించారు. ఉక్రెయిన్ అంశంతో పాటు భారత్, బ్రిటన్ మధ్య ఉన్న సంబంధాలు, వాటి పురోగతిపై కూడా ఇరువురు నేతలూ మాట్లాడుకున్నారు.
మక్రీవ్ తిరిగి కైవసం చేసుకున్న ఉక్రెయిన్
ఇదిలా ఉంటే.. గత 27 రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులను కొనసాగిస్తూనే ఉంది. రోజురోజుకు ఇరు దేశాల మధ్య వైరం తీవ్రం అవుతుంది. నగరాలపై పట్టు సాధించేందుకు రష్యా సేనలు విరుచుకు పడుతున్నాయి. విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ తరుణంలో రష్యా సైనికులు ఆధునాత మిస్సైల్స్‌ను ప్రయోగిస్తున్నారు. తొలుత సైనిక స్థావరాలపై దాడి చేసిన రష్యన్ సేనలు.. సాధారణ పౌరులను కూడా టార్గెట్ చేస్తూ దాడులను ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకోవాలన్న రష్యా ప్రయత్నాలను జెలెన్‌స్కీ సేనలు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నాయి. ఈ తరుణంలో రాజధాని శివార్లలోని మక్రీవ్ నుంచి రష్యా బలగాలను తరిమికొట్టి.. ఆ ప్రాంతాన్ని తిరిగి కైవసం చేసుకున్నట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ మంగళవారం ప్రకటించింది.
మరోవైపు.. మరియుపోల్‌ను అప్పగించాలని రష్యా కోరింది. కానీ, రష్యా డిమాండ్‌ను ఉక్రెయిన్ తిరస్కరించింది. దీంతో రష్యాన్ సేనలు మరింతగా రెచ్చిపోయాయి. భవనాలు, వాణిజ్య సముదాయాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో నగరం నుంచి పౌరులను తరలించే కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. యుద్ద నేపథ్యంలో తాగడానికి నీరు, తినడానికి ఆహారంలేక ఎంతోమంది చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, డీహైడ్రేషన్‌తో పలువురు చిన్నారులు ఇప్పటికే మరణించినట్టు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
రష్యాకు భయపడుతున్నారా? జెలెన్‌స్కీ
నాటో కూటమిలో చేర్చుకోవాలని ఉక్రెయిన్ విజ్ఞప్తిని తోసిపుచ్చడంపై జెలెన్‌స్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కూటమిలో చేర్చుకోండి లేదా రష్యాకు భయపడి చేర్చుకోలేకపోతున్నామని ఒప్పుకోండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో నేరుగా చర్చలు జరుపాలని, భేటీ అయితే తప్ప యుద్ధం ముగియదన్నారు. మరోవైపు, యుద్ధంలో ఇప్పటివరకూ 9,861 మంది రష్యా సైనికులు మరణించారని పుతిన్ సర్కారు అనుకూల న్యూస్‌సైట్ కొమ్సోమోల్క్సాయ ప్రావ్డా వెల్లడించింది.