చెప్పుల ఖరీదు రూ.123కోట్లు

By ramya neerukondaFirst Published 26, Sep 2018, 12:10 PM IST
Highlights

యుఏఈకి చెందిన ప్రఖ్యాత బ్రాండ్‌ ‘జాదా దుబాయ్‌’ ...ప్రముఖ ఆభరణాల సంస్థ ‘ప్యాషన్‌ జువెలర్స్‌’తో కలిసి ఈ పాదరక్షలను తీర్చిదిద్దారు. 

ఈ ఫోటోలో కనిపిస్తున్న చెప్పులు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కదా. బంగారం, డైమెండ్స్ కలబోతతో దీనిని తయారు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెప్పులు ఇవి. ఇంతకీ దీని ఖరీదు ఎంతో తెలుసా..? ఏకంగా రూ.123 కోట్లు...ఔను! అక్షరాలా నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు.  

ప్రపంచప్రఖ్యాతిగాంచిన  ‘బుర్జ్‌దుబాయ్‌’లో వీటిని బుధవారం ఆవిష్కరించనున్నారు. మిలమిలాడే మేలిమి బంగారం, మేలుజాతి వజ్రాలతో వీటి తయారీకి ఏకంగా తొమ్మిదినెలల వ్యవధి పట్టింది.  యుఏఈకి చెందిన ప్రఖ్యాత బ్రాండ్‌ ‘జాదా దుబాయ్‌’ ...ప్రముఖ ఆభరణాల సంస్థ ‘ప్యాషన్‌ జువెలర్స్‌’తో కలిసి ఈ పాదరక్షలను తీర్చిదిద్దారు. 

వజ్రపు కాంతులీనే పసిడి పాదరక్షలను బుధవారం లాంఛనంగా ఆవిష్కరించిన తర్వాత ....ఇకపై ఆసక్తి ఉన్న వారు ఇచ్చే పాదాల కొలతల మేరకు ఆర్డరుపై తయారు చేసి అందచేయనున్నట్లు ‘జాదా దుబాయ్‌’ సహవ్యవస్థాపకురాలు, డిజైనరు అయిన మరియా మజారి తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి కుబేరసమానులైన 50 మంది ప్రముఖులను ఆహ్వానించారని ‘ఖలీజ్‌టైమ్స్‌’ మరియాను ఉటంకిస్తూ తెలిపింది.

Last Updated 26, Sep 2018, 12:10 PM IST