అభినందన్‌ గుండె ధైర్యాన్ని మెచ్చుకున్న పాక్ మీడియా

By Siva KodatiFirst Published Feb 28, 2019, 4:40 PM IST
Highlights

భారత్‌ అన్నా.. భారత సైన్యమన్నా నిలువెల్లా విషం కక్కే పాక్ మీడియా తొలిసారిగా ఒక భారతీయ సైనికుడిని ప్రశంసిస్తూ కథనం రాసింది.

భారత్‌ అన్నా.. భారత సైన్యమన్నా నిలువెల్లా విషం కక్కే పాక్ మీడియా తొలిసారిగా ఒక భారతీయ సైనికుడిని ప్రశంసిస్తూ కథనం రాసింది. అతను ఎవరో కాదు.. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ అదుపులో ఉన్న మిగ్-21 యుద్ధ విమాన పైలట్ ‘అభినందన్ సింగ్’..

పాక్‌లోని కరాచీ కేంద్రంగా నడిచే ‘‘ది డాన్’’ పత్రిక పాకిస్తాన్ సైనిక బలగాలకు చిక్కిన అభినందన్ సింగ్‌ గురించి కథనం రాసింది. ‘‘ శత్రుదేశానికి పట్టుబడతానని తెలిసి కూడా, ప్రాణాలు పోయే పరిస్ధితిలోనూ భయభ్రాంతులకు లోనుకాకుండా అతను కర్తవ్యం మరువలేదని పేర్కొంది.

మంటల్లో సజీవదహనమయ్యే పరిస్ధితి నుంచి బయటపడిన అభినందన్ తెలివిగా వ్యవహరించి తన వద్ద ఉన్న కీలక డాక్యుమెంట్లను మాయం చేశాడని ప్రశంసించింది. మిగ్-21 విమానం కూలిపోవడంతో పారాచ్యూట్ సాయంతో  అభినందన్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దిగాడు.

అక్కడున్న కొందరు స్థానికుల్ని ఇది ఇండియానా, పాకిస్తానా అని అడిగాడు. దీంతో అక్కడున్న వారిలో ఒకరు ఇది ఇండియా అని బదులిచ్చాడు. దీంతో అతను ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశాడు.

‘‘ నా నడుము విరిగిపోయింది.. దాహంగా ఉంది.. మంచినీరు కావాలి’’ అని అడిగాడు. అయితే అక్కడున్న పాకిస్తానీయులు... భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయడతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అరిచారు.

దీంతో తాను కాలు మోపింది ఎక్కడో అర్ధమైన అభినందన్ వెంటనే పిస్టల్ బయటకు తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. అయితే స్ధానికులు రాళ్లతో అతనిని తరుమారు.. నడుము విరిగిపోయినా అభినందన్ అరకిలోమీటరు దూరం పరిగెత్తాడు..

అక్కడే ఉన్న కాలువలో దాక్కొని తన జేబులో ఉన్న కీలక పత్రాలను మింగేశాడు. మరికొన్నింటిని ముక్కలు ముక్కలు చేసి నీటిలో కలిపేశాడు. స్థానికులు వెంబడించి ఎట్టకేలకు సైన్యానికి అప్పగించారు.

‘‘అనంతరం మీ లక్ష్యం ఏంటని పాక్ సైనికులు అడిగిన ప్రశ్నకు... జవాడు చెప్పదలచుకోలేదని పేర్కొన్నారు’’. కాగా, ప్రస్తుత పరిస్ధితుల్లో భారత్ అంటే రగిలిపోతున్న పాక్ పౌరులు.. ఈ కథనాన్ని వ్యతిరేకిస్తారని తెలిసినా కూడా డాన్ ఆ కథనాన్ని ప్రచురించడం గొప్ప విషయమని పలువురు పాత్రికేయులు చెబుతున్నారు. 

click me!